ys Jagan in paderusabha

మన్యాన్ని జిల్లాగా చేస్తా!
బాక్సైట్ తవ్వే ప్రసక్తే లేదు
పాడేరు సభలో వైఎస్ జగన్
సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే మన్యం కేంద్రంగా ఓ జిల్లాను తయారు చేస్తామని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
పాడేరులో శనివారం పర్యటించిన ఆయనకు స్థానిక గిరిజనులు సంప్రదాయ అడ్డాకులతో తయారు చేసిన గిడుగును తొడిగి సాదరంగా స్వాగతం తెలిపారు. అనంతరం విల్లు ఎక్కిపెట్టిన ఆయన మన్యం అభివృద్ధిపై గురిపెట్టారు.
అనంతరం పట్టణ ప్రధాన రహదారిలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన గిరిజన ప్రాంతంలో నా తండ్రి వైఎస్సార్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో రావడం ఖాయమని చెప్పిన ఆయన మనమంతా కలిసి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని భరోసా కల్పించారు.
మీరంతా గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని చెప్పి తెదేపా మిమ్మల్ని అభివృద్ధికి దూరం చేసిందని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఈశ్వరమ్మ బాక్సైట్ విషయంలో చంద్రబాబును ఎలా తిట్టారో నాకంటే మీకే బాగా తెలుసునన్నారు.
మన్యాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన గిరిజనులకు ఆరోగ్యాన్ని చేరువ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివాసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.
‘మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అధికారంలోకి వస్తే బాక్సైట్‌ను తవ్వబోమ’ని స్పష్టీకరించారు. మీకు నిత్యం అందుబాటులో ఉన్న నాయకులు మాధవి, భాగ్యలక్ష్మిని బలపర్చి మన్యంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురేలా చూడాలన్నారు. అంతకు ముందు పాడేరు అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాడేరు సీటు గెలిపించి జగన్నకు మనమంతా కానుకగా ఇవ్వాలన్నారు.
గత ఎన్నికల్లో గెలిపించిన నేత మనల్ని మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. అరకు పార్లమెంట్ అభ్యర్థి గొట్టేటి మాధవి మాట్లాడుతూ జగనన్న తనపై ఎంతో నమ్మకంతో పార్లమెంట్‌కు పంపుతున్నట్లు చెప్పారు. మీరంతా మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె కోరారు.
సమన్వయకర్తకు న్యాయం చేస్తా..
కొన్ని సమీకరణల వల్ల పాడేరు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. మీ అందరి ముందు చెబుతున్నా, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశ్వేశ్కు ఏమి చేయాలో ఆలోచించి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన సభాముఖంగా తెలియజేశారు.
అంతకు ముందు జగన్ సభా వేదిక వద్దకు చేరుకోగానే ఆంధ్ర సీఎం జగన్.. పాడేరు ఎమ్మెల్యే విశ్వేస్ అంటూ బ్యానర్లను విశ్వేశ్వరరాజు వర్గం ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.