సచివాలయ పోస్టులకు రాతపరీక్ష సెప్టెంబరు 1న

సచివాలయ పోస్టులకు రాతపరీక్ష సెప్టెంబరు 1న
జిల్లా మొత్తంగా 10,782 పోస్టుల భర్తీ చేస్తుండటంతో ఒక్కో పోస్టుకు 30 మందికి తక్కువ కాకుండా దరఖాస్తు చేస్తారని, ఆ లెక్కన జిల్లాలో మూడు లక్షల మందికి పైగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తుండడంతో వీటి కోసం దరఖాస్తు చేయడానికి నిరుద్యోగ యువత పోటెత్తుతున్నారు.
ఈ కొలువులు యువతలో కొత్త ఉత్సాహన్ని నింపుతుంటే.. అధికారుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలన్నీ ఒకేరోజు (సెప్టెంబర్ 1) నిర్వహించాల్సి రావడంతో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయగలమా అన్న సంశయం కనిపిస్తోంది.
ఇప్పటి నుంచే పరీక్షా కేంద్రాల గుర్తింపు.. ఇతర అవసరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. లక్షలాది అభ్యర్థులు రాయబోయే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను పెద్ద సవాల్‌గానే భావిస్తున్నారు.
*ప్రభుత్వ సేవలు, ఇతరత్రా అవసరాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే అన్ని రకాల సేవలను సర్కారు అందుబాటులోకి తెస్తోంది.
దీనికోసమే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతోంది. 13 ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఈ సచివాలయాల్లో నియమిస్తోంది. దీనికోసం భారీగా ఉద్యోగ నియామక ప్రకటన జారీచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 10,782 మందికి సర్కారు కొలువులు సాధించే అవకాశం లభించింది.
*జిల్లాలో 739 గ్రామ సచివాలయాలు, 604 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో 13 ప్రభుత్వ శాఖలు, వార్డు సచివాలయాల్లో తొమ్మిది శాఖలకు సబంధించిన ఉద్యోగులను అందుబాటులో ఉంచనున్నారు.
*ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈనెల 26 ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అందులో జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో 7,789 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 3,083 కొలువుల భర్తీకి అవకాశం లభించింది.
ఎక్కువ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతను అర్హతగా తీసుకోగా కొన్ని ఉద్యోగాలకు సాంకేతిక విద్యార్హతలు ఉండేలా నిర్ణయించారు. ఎప్పుడూ గ్రూప్-2, 3లో అరకొర పోస్టులను భర్తీ చేయడమే తప్పా జిల్లా పరిధిలో వేల సంఖ్యలో ఒకేసారి పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమం. దీంతో నిరుద్యోగ యువత అంతా ఈ పోస్టులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
ఇటీవల గ్రామ వాలంటీర్ల నియామకాలు జరిపినా సచివాలయ ఉద్యోగాలు ముందున్నాయనే ధీమాతో చాలా మంది వాలంటీర్లకు దరఖాస్తు చేసినా మౌఖిక పరీక్షలకు వెళ్లలేదు.
అధికారులు కూడా ఈ సచివాలయ పోస్టులకు లక్షల మంది పోటీపడతారని అంచనా వేస్తున్నారు. వందల సంఖ్యలో పరీక్షా కేంద్రాలను గుర్తిస్తే సరిపోదు.. ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు కావడంతో వీటిని సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. డీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తుండడంతో అందుకు తగ్గట్లుగా పరీక్షలను నిర్వహించాలి.
దీనికోసం వేల సంఖ్యలో మానవ వనరులు అవసరం. పరీక్షా కేంద్రంలో ప్రతి గదికి ఓ ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు, రూట్ అధికారులు.. ఇలా అన్ని రకాల కేటగిరీల్లో ఉద్యోగులను పరీక్షల నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుంది.
ఒకే రోజున అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లకు పెద్దఎత్తున పోలీసు సిబ్బంది, రవాణాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు వంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో 852 పరీక్షా కేంద్రాలను ఈ పోస్టుల కోసం వినియోగించుకుంటే సుమారు 25 వేల మంది ఉద్యోగులను ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వాములను చేయాల్సి ఉంటుందని అంచనా.
పరీక్ష కేంద్రాలు ఏ స్థాయిలో..?
సచివాలయ ఉద్యోగ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే పరీక్షా కేంద్రాలు.. ఇతర ఏర్పాట్లపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అవసరమైన మేరకు పరీక్షా కేంద్రాలు జిల్లాలో ఎన్ని ఉన్నాయో గత రెండు రోజులుగా గుర్తించడం మొదలుపెట్టారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. 852 పరీక్షా కేంద్రాలున్నట్లు ప్రభుత్వానికి నివేదించారు.
అయితే లక్షల మంది పోటీపడే ఈ పరీక్షలను డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారా.. నియోజకవర్గ కేంద్రాల్లో చేపడతారా.. మండల కేంద్రాల్లోనే నిర్వహిస్తారాన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ నిర్ణయం బట్టి పరీక్షా కేంద్రాల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.