News

Realestate News

గెలుపు, ఓటములపై అంచనాకు వస్తున్న వైనం ఓటు నాడి పట్టేద్దాం..


ఓటు నాడి పట్టేద్దాం..

ప్రజాభిప్రాయ సేకరణలో ప్రధాన పార్టీలు

గెలుపు, ఓటములపై అంచనాకు వస్తున్న వైనం

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. విజయం తమదంటే తమదంటూ ప్రధాన పార్టీలు భావించుకుంటున్నాయి. మరోవైపు ఎవరు గెలుస్తారోననే సందేహంలో పడుతున్నాయి.

కొన్ని స్థానాల్లో గెలుపు తమదంటే తమదేనంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రహస్య పద్ధతిలో జరిగిన ఓటింగ్‌ విధానంలో ఓటరు ఎవరికి పట్టం కట్టారో మే 23న ఫలితం వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

అంతవరకు ఓపిక పట్టని కొందరు నాయకులు తమ ఫలితాలపై ఒక అంచనాకు వచ్చేందుకు సామాజిక మాధ్యమాలను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా వాయిస్‌ రికార్డు కాల్స్‌ ద్వారా ఓటు ఎవరికి వేశామో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగాయి. విశాఖ పార్లమెంటు పరిధితో పాటు అరకు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలతో కలిపి మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగాయి.

ఈ దఫా ఎన్నికలు గతానికి భిన్నంగా జరగడంతో ఓటరు నాడి తెలుసుకునేందుకు రాజకీయులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే ఉండేది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ పోటీ మూడు, నాలుగు పార్టీల మధ్య సాగడంతో నువ్వా, నేనా అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి.

ఎవరికి విజయం దక్కుతుందనేది కచ్చితంగా చెప్పలేని వాతావరణం అన్ని చోట్లా ఏర్పడింది. తెదేపా తప్పక గెలుస్తుందనుకున్న చోట కొన్ని సందేహాలు లేకపోగా వైకాపా విజయం తథ్యమనుకున్న చోట కొన్ని అనుమానాలు నెలకొంటున్నాయి.

ఈ సందర్భంలో విజయం ఎవరిని వరిస్తుందనేది తలపండిన రాజకీయ నాయకులు సైతం చెప్పలేని విధంగా తయారైంది. తెదేపా, వైకాపాతో పాటు భాజపా, జనసేనలు మిగిలిన పార్టీలతో పోటీ పడుతున్నాయి. తెదేపా, వైకాపా బలంగా ఉన్నప్పటికీ జనసేన అభ్యర్థులు కొంత ప్రభావం చూపనుండడంతో విజయం ఎవరికి దక్కుతుందో తేల్చుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా పోలింగ్‌ జరిగిన రోజున ఓటరు ఓటు ఎవరికి వేశారనే కచ్చితమైన సమాచారం రాకపోవడం, ఎక్కువమంది చెప్పేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఫలితం తేలడం లేదు. ఈ సమయంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లకు ఫోన్లు చేసి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ముందుకు వెళ్తున్నారు.

ఓటు ఎవరికి వేశారో తెలుసుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు వాయిస్‌ రికార్డింగ్‌ ఫోన్‌ ద్వారా ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైన ఒక నెంబరుకు ఫోన్‌ చేసి..ఇది ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం చేస్తున్న ఫోన్‌ కాల్‌ అంటూ సమాచారం ఇచ్చి అభిప్రాయ సేకరణ లోపలికి వెళ్తున్నారు.

మీరు మీ పార్లమెంటు పరిధి అభ్యర్థికి సంబంధించి ఎవరికి ఓటు వేశారని అడుగుతున్నారు. ఆ తరువాత మీరు తెదేపాకు ఓటు వేస్తే 1, వైకాపాకు వేస్తే 2, భాజపాకు వేస్తే 3, జనసేనకు వేస్తే 4, ఇతరులకు వేస్తే 5 నంబరు నొక్కమని చెబుతున్నారు.. అలాగే పలు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా చోట్ల ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నారు.

ప్రజల నుంచి కచ్చితమైన సమాచారం రాబట్టడం కోసం అభ్యర్థుల తరపున కొన్ని సర్వే ఏజెన్సీలు ఇటువంటి సర్వేలు చేపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.