బడి బస్సులపై కొరడా సామర్థ్యం లేని మూడు బస్సుల సీజ్

బడి బస్సులపై కొరడా
సామర్థ్యం లేని మూడు బస్సుల సీజ్
నిబంధనలను పాటించకుండా విద్యార్థులను తీసుకువెళుతున్న పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు.
గురువారం జిల్లాలో ఉదయం 7 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పలు చోట్ల రవాణా శాఖ డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జిల్లాలో మొత్తం 200 పాఠశాల బస్సులను పరిశీలించిన అధికారులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న మూడింటిని సీజ్ చేశారు.
నిబంధనలు పాటించని 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు లేకుండా అలంకారప్రాయంగా ఉండటం, డ్రైవర్ యూనిఫామ్ ధరించకపోవడం, అగ్నిమాపక సిలిండర్లో గ్యాస్ లేకపోవడం, మొదటి మెట్టు భూమి నుంచి 325 మి.మీ.ఎత్తు సక్రమంగా లేకపోవడం, బస్సులో కూర్చున్న విద్యార్థులు కదలకుండా ముందు ఉండవలసిన సపోర్ట్ రాడ్లు లేకపోవడం వంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
విశాఖ జిల్లాలో పాఠశాల బస్సుల తనిఖీలు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలియజేశారు.
రవాణాశాఖ నిబంధనల ప్రకారం ప్రతి బస్సు విషయంలో 32 అంశాల్ని పక్కాగా ఉంటేనే ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నామన్నారు.
ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా, వాటిని వెనక్కి పంపించేసి సరిచేసుకుని వచ్చేవరకు ధ్రువపత్రాలు జారీ చేయడం లేదని తెలిపారు.
పది రోజులపాటు పాఠశాల బస్సులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని, ఫిట్నెస్ లేకుండా తిరిగే వాటిని సీజ్ చేస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలో ఇంకా 838 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోలేదు.
పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా 838 బస్సుల్ని సంబంధిత యాజమాన్యాలు సామర్థ్య పరీక్షలకు తీసుకురాలేదు. శని, ఆదివారాలు సెలవు దినాల్లో కూడా పాఠశాల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు.
దీంతో పాటుగా కొన్ని పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఈలోగా పూర్తి స్థాయిలో బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.
ఫిట్నెస్ లేకుండా రహదార్లపై బస్సులు తిరిగితే సీజ్ చేయడంతో పాటు, బస్సు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.