News

Realestate News

ఉన్నత స్థితికి చేర్చేది చదువే

Vineyanth, collector students, Araka MP Madhavi.


ఉన్నత స్థితికి చేర్చేది చదువే

 

తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కకు నీరుపోస్తున్న
కలెక్టర్‌ వినయ్‌చంద్, అరకు ఎంపీ మాధవి, అధికారులు

 

ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు విద్యాభ్యాసం ఒక్కటే సరైన మార్గమని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు నాలుగు రోజులపాటు నిర్వహించే రాజన్న బడిబాట కార్యక్రమాన్ని బుధవారం పండగ వాతావరణంలో ప్రారంభించారు.

పాడేరులో తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాలలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌చంద్, అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొట్టేటి మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ముందుగా పాఠశాల ప్రాంగణంలో అతిథులు మొక్క నాటారు. వేదిక వద్దకు చేరుకుని జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజన్న బడిబాట ప్రాముఖ్యాన్ని సభికులకు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని విశాఖ మన్యంలో ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో పీఓగా పని చేసిన మన్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం యాదృచ్ఛికమన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. చక్కగా చదువుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అరకు ఎంపీ మాధవిని చూస్తే మీకు అర్ధమవుతుందన్నారు.

రెండు, మూడు పాఠశాలల్లో సాధారణ ఉపాధ్యాయురాలిగా పని చేసిన ఆమె ఈ రోజు ఎంపీ అయ్యారని, మీరంతా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ నాలుగు రోజులపాటు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

పాఠశాల మనదే అనే భావం అందరిలో కలగాలని పేర్కొన్నారు. సెలవుల్లో ఇంటికే పరిమితమైన విద్యార్థులను ఆహ్వానించేందుకు పాఠశాలలన్నీ సుందరంగా, ఆహ్లాదంగా, ఆత్మీయ వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.

మొదటి రోజు స్వాగత సంబరాల కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లే మిగిలిన మూడు రోజులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు.