భారీ గణపతికి ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు

గాజువాక, న్యూస్టుడే: గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ గణనాథునికి ప్రతిష్టాత్మక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు(ఇండియన్ వరల్డ్ రికార్డు)లో చోటు దక్కింది. పాతగాజువాక లంకా మైదానంలో విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్(విశ్వ) ఆధ్వర్యంలో యువకులు 78 అడుగుల ఎత్తయిన దశావతార గణపతిని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. పర్యావరణ హితమైన పద్ధతుల్లో ఇంత భారీగణపతిని ప్రతిష్ఠించడం, 120 అడుగుల మండపం, 29,465 కిలోల బరువుగల లడ్డూ ప్రసాదం తయారుచేసినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి డాక్టర్ జీవీఎన్ఆర్ఎస్ఎస్ఎస్ వర ప్రసాద్ పర్యవేక్షణలో మూడు ధ్రువీకరణ పత్రాలు విశ్వ ప్రతినిధి పల్లా రమణ యాదవ్, తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ప్రతినిధి మల్లిబాబుకు సోమవారం రాత్రి అందించారు. మండపం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ధ్రువపత్రాలు నిర్వాహకులకు బహూకరించారు. పల్లా రమణ యాదవ్ మాట్లాడుతూ అందరి సమష్టి కృషితో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నామని, ఇక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోనూ చోటు సంపాదించుకొంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 28వరకూ ఉత్సవాలు కొనసాగుతాయని, ఆఖరు రోజున ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనోత్సవం నిర్వహిస్తామని వివరించారు.