News

Realestate News

వుడాకే విరాట్‌!

virat vizag, vizagrealestate news

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

భారత నౌకా దళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను నక్షత్ర హోటల్‌గా, ప్రదర్శనశాలగా మార్చే పూర్తి బాధ్యతను ప్రభుత్వం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు అప్పగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ఈ అంశంపై సమీక్షించినపుడు.. యుద్ధనౌకను విశాఖ తీరానికి తీసుకురావడానికి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, ఇక్కడికి తెచ్చాక తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రణాళిక తయారీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాలుగైదు శాఖల అధికారులను ప్రభుత్వం భాగస్వాములను చేసింది. తూర్పు నావికాదళ వర్గాల సహకారం కూడా తీసుకోవాలని సూచించింది. ఈ విషయంలో పురోగతి లోపించడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వుడాకు విరాట్‌ యుద్ధనౌకకు సంబంధించిన పూర్తి బాధ్యతలను కలెక్టరు ఆధ్వర్యంలో అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచనలు చేశారని తెలిసింది. దీనిపై కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.

ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను విశాఖ తీరానికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇటీవల అంగీకరించిందని తెలిసింది. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కురుసర జలాంతర్గామిని సేవల ఉపసంహరణ అనంతరం ఆర్కేబీచ్‌లో మ్యూజియంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు ఉన్నా.. విరాట్‌ యుద్ధనౌకను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడానికే కేంద్రం అంగీకరించిందని అధికార వర్గాలు తెలిపాయి.

వుడాకే ఎందుకంటే…?
విరాట్‌ను విశాఖ తీరంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మొదట పర్యాటకశాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. సంబంధిత ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. నౌకాదళ అధికారులనూ భాగస్వాములను చేశారు. ఆ నౌకను విశాఖకు తీసుకొచ్చి నక్షత్రాల హోటల్‌గా, మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ. 700 కోట్ల వ్యయమవుతుందని ఒక కన్సల్టెన్సీ సంస్థ నివేదిక కూడా సిద్ధం చేసింది. ఇటీవల కాలంలో తగిన పురోగతి లేకపోవడం, అధికారుల్లో అశ్రద్ధపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ వుడాకే పూర్తి బాధ్యత అప్పగించాలని ఉన్నతాధికారులకు సూచించారని తెలుస్తోంది. కురుసర జలాంతర్గామిని బీచ్‌ రోడ్డులో మ్యూజియంగా ఏర్పాటుచేసిన అనుభవం వుడా అధికారులకు ఉంది. విరాట్‌ విషయంలో అయ్యే ఖర్చునూ వుడా నిధుల నుంచే ఖర్చు భరించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పరోక్షంగా సూచించారు. ఈ పరిస్థితుల్లో వేరొకర్ని ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అధికారికంగా ఆదేశాలు వెలువడిన వెంటనే కలెక్టరు, వుడా ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.