News

Realestate News

పర్యాటక అభివృద్ధి మండళ్ల ఏర్పాటు

news of vizag development of tourism

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 విశాఖపట్నం :

పర్యాటకంగా విశాఖకు అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జిల్లా స్థాయి పర్యాటక మండలి (డీటీసీ)ని ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జిల్లా స్థాయి మండలికి ఛైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనరుగా పర్యాటక ప్రాంతీయ సంచాలకుడు వ్యవహరిస్తారు. మరో ముగ్గురు అధికారులను సభ్యులుగా కలెక్టరు నియమిస్తారు. పర్యాటకరంగ అభివృద్ధిలో నైపుణ్యం, అనుభవం కలిగిన మరో నలుగుర్ని కూడా నియమిస్తారు. నగర పర్యాటక మండలి (సీటీసీ)కి ఛైర్మన్‌గా జీవీఎంసీ కమిషనర్‌, కన్వీనరుగా పర్యాటక విభాగ ఉప సంచాలకుడు, సభ్యులుగా పట్టణ ముఖ్య ప్రణాళిక అధికారి, పర్యాటక ప్రాంతీయ సంచాలకుడు, ప్రభుత్వశాఖల నుంచి మరో అధికారి, పర్యాటక రంగ అభివృద్ధిలో నైపుణ్యం, ప్రవేశం కలిగిన మరో నలుగుర్ని జీవీఎంసీ కమిషనర్‌ నియమించనున్నారు.
మండళ్ల బాధ్యతలేమిటి?
* ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వ, జీవీఎంసీ, వుడాకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించాలి. ఆ ప్రాంతాలకు అనువైన పర్యాటక ప్రాజెక్టులను కూడా గుర్తించి పెట్టుబడుదారుల ఎంపికలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలి.

* పీపీపీ ప్రాజెక్టుల ఏర్పాటు నిమిత్తం తగిన ప్రచారం కల్పించడం, పెట్టుబడుదారులను ఆహ్వానించి సమావేశాలు నిర్వహించడం, దృశ్య, శ్రవణ ప్రదర్శనలివ్వడం వంటి కార్యక్రమాల నిర్వహణలోనూ చురుగ్గా పని చేయాలి.

* పర్యాటక రంగానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలి. పెట్టుబడులదారులను కూడా ఆహ్వానించి ఈ రంగంలో ప్రాజెక్టుల నిర్వహణకు అవకాశాలను వెల్లడించాలి.

ఇవీ లక్ష్యాలు:
2022 నాటికి: పర్యాటక రంగంలో దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలవాలి

2029నాటికి: దేశంలో పర్యాటక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండాలి

వచ్చే 5 ఏళ్లలో: పర్యాటక రంగంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలి