కేజీహెచ్‌లో థలస్సీమియా క్లినిక్ ఏర్పాటు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కింగ్‌జార్జి ఆసుపత్రిలో థలస్సీమియా క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. రక్తహీనత, రక్తం గడ్డకట్టక పోవడం వంటి రుగ్మతలతో బాధపడే వారికి అవసరమైన వైద్య సహాయం, రోగ నిర్ధరణ పరీక్షలు, కౌన్సెలింగ్ వంటి అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద థలస్సీమియా రోగులకు ఇక నుంచి వైద్యం అందించనున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ వైద్యం పొందే కన్నా.. వారానికి ఒకరోజు క్లినిక్ నిర్వహిస్తూ అదేరోజున అవసరమైన వైద్యం అందించేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ జి.అర్జున తెలిపారు. క్లినిక్ నిర్వహణకు తన నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైందని, మెడిసిన్, పీడియాట్రిక్, రక్తనిధి కేంద్రం, ఎన్టీఆర్ వైద్యసేవ విభాగాలకు చెందిన వైద్యాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీ తొలి సమావేశాన్ని ఆదివారం నిర్వహించామని, త్వరలోనే క్లినిక్ ఏర్పాటుచేసి, ఏరోజున నిర్వహించేదీ ప్రకటిస్తామన్నారు. థలస్సీమియా రోగులకు కనిష్ఠంగా 5, గరిష్టంగా 20 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన, మెరుగైన సేవలందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సమీక్షలో పిల్లల విభాగాధిపతి డాక్టర్ పద్మలత, వైద్య విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఇందిరాదేవి, రక్తనిధి కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె.శ్యామలాదేవి, ఎన్టీఆర్ వైద్య సేవ విభాగ వైద్యాధికారి డాక్టర్ ఎం.విజయశంకర్ తదతరులు పాల్గొన్నారు.