News

Realestate News

సెప్టెంబరులో ఉపాధ్యాయ నియామకాలు


సెప్టెంబరులో ఉపాధ్యాయ నియామకాలు

విద్యార్థులకు బ్యాగులు, దుస్తులు అందజేస్తున్న ఎమ్మెల్యే బాబూరావు,
చిత్రంలో డీఈఓ లింగేశ్వరరెడ్డి తదితరులు

జిల్లాలో నూతన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను సెప్టెంబరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. హెటిరో పరిశ్రమ యాజమాన్యం విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, దుస్తుల ను పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావుతో కలిసి ఆయన నక్కపల్లిలో శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా డీఈఓ విలేకరులతో మాట్లాడారు. 626 ఖాళీలను భర్తీ చేస్తామని, ఉపాధ్యాయుల్లేని పాఠశాలలకు ముందుగా కేటాయిస్తామని పేర్కొన్నారు.

ఈ ఏడాది 17,95,000 పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేశామని, ఎక్కడైనా అవసరం ఉంటే మరిన్ని అందిస్తామన్నారు.

28 మండలాల్లోని విద్యార్థులకు ఒక్కో జత దుస్తులు ఇచ్చినట్లు వివరించారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో 25 వేల మంది విద్యార్థులు చేరగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 16 వేల మంది వచ్చారన్నారు.

ప్రస్తుతం పదో తరగతి వరకు 3.17 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. 900 శిథిల తరగతి గదులు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులకు ఇందులో బోధన జరగకుండా ఉపాధ్యాయులు చూడాలన్నారు.

బోధనకు ఆటంకంగా మారిన చోట స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు.