ఏయూలో ప్రతిభ కేంద్రం

ఏయూలో ప్రతిభ కేంద్రం
డి.ఎస్.టి. సలహాదారు డాక్టర్ అఖిలేశ్గుప్తా
● వాతావరణ మార్పులపై అధ్యయనానికి 12 జాతీయ విద్యాసంస్థల్లో ‘ప్రతిభ కేంద్రాల’ను ఏర్పాటు చేశాం. ఏడాదికి రూ. 2 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 10 కోట్లను కేటాయించాం.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కూడా ఒక ప్రతిభ కేంద్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏయూ వాతావరణశాస్త్ర విభాగానికి ప్రాంతీయ వాతావరణ మోడలింగ్ను అభివృద్ధి చేసే ప్రాజెక్టును కేటాయించాం. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే రెండోదశలో ‘ప్రతిభా కేంద్రం’ వస్తుంది.
● వివిధ రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్న వాతావరణశాస్త్ర విభాగాల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతం చేయాలి. దీనివల్ల ప్రతిభావంతులైన పరిశోధకులు తయారవుతారు. ఇలాంటి విశ్వవిద్యాలయాలను డి.ఎస్.టి. ఇకపై ప్రోత్సహిస్తుంది. సమగ్ర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటే పరిశోధనలకయ్యే వ్యయాన్ని డి.ఎస్.టి. భరిస్తుంది.
● వాతావరణశాస్త్ర పరిశోధనలు చేసే విభాగాలకు డి.ఎస్.టి. అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్లను, సాంకేతిక సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తుంది. వాతావరణ అంచనాలకు మోడలింగ్లు అభివృద్ధి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది.
మన దేశం వద్ద వందేళ్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది.
● దేశంలో ఉన్న వాతావరణ నిపుణులందరితో ‘టాలెంట్ పూల్’ ఏర్పాటు చేసి పరిశోధనలను మరింతగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
వాతావరణశాస్త్ర నిపుణులు మూడువేల మంది, పరిశోధక విద్యార్థులు 2,500 మంది, అంతర్జాతీయ గుర్తింపు పొందిన 400 మందిని అనుసంధానం చేసి వాతావరణశాస్త్ర ప్రగతిలో విప్లవాత్మక మార్పులు తేవాలన్నదే లక్ష్యం.
గత ఐదేళ్లలో 1200 మంది శాస్త్రవేత్తలతో 300 పరిశోధన కేంద్రాలను అనుసంధానించి 180 కార్యక్రమాలను నిర్వహించాం.
● మన విశ్వవిద్యాలయాలు స్విట్జర్లాండ్లోని విశ్వవిద్యాలయాలతో సంయుక్త పరిశోధనలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాం.
● హిమాలయాల వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాతావరణ మోడలింగ్లపై సమర్పించిన పరిశోధన పత్రాల సంఖ్య గతంతో పోల్చుకుంటే పెరిగింది.
వాతావరణ మార్పులపై దేశవ్యాప్తంగా పరిశోధనలను ముమ్మరం చేస్తున్నామని భారత శాస్త్ర సాంకేతిక విభాగం (డి.ఎస్.టి.)
సలహాదారు డాక్టర్ అఖిలేశ్గుప్తా పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య వి.పి.సుబ్రహ్మణ్యం స్మారకోపన్యాసం ఇవ్వడానికి వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.