News

Realestate News

ఆదివారం… గుంపులు గుంపులుగా జనం

ఆదివారం… గుంపులు గుంపులుగా జనం

                                

మాంసం, చేపల మార్కెట్లలో సామాజిక దూరం పాటించని జనం

ప్రత్యేక పర్యవేక్షణ అవసరమంటున్న నిపుణులు

విశాఖ చేపల రేవులో ఆదివారం కనిపించిన దృశ్యమిది. వేలాది మంది ఒకే సారి చేరుకోవడంతో రేవు కిటకిటలాడింది. జనాలు ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. చేపల విక్రేతలది కూడా అదే పరిస్థితి. కరోనా నియంత్రణ సామాజిక దూరంతోనే సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నా…ఎవరి చెవికీ ఎక్కడం లేదు.

– ఈనాడు, విశాఖపట్నం

ఈనాడు, విశాఖపట్నం : లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలకు ఇబ్బంది కలగకూడదని కొంత వెసులుబాటు కల్పిస్తే నగరంలో కొందరు దీన్ని అపహాస్యం చేస్తున్నారు. కరోనా నివారణకు సామాజిక దూరం తప్పనిసరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే ప్రజలు మాత్రం రోడ్ల మీద యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలు కళ్లముందే కకావికలం అవుతుంటే ఇక్కడ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సామాజికవాదులు నిరసిస్తున్నారు.

వ్యక్తిగత రక్షణకు మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం గురించి చెబుతుంటే క్షేత్రస్థాయిలో పాటించకపోడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చెప్పిచెప్పి పోలీసులు సైతం విసుగెత్తిపోయారు. ఆదివారం నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చారు. ఇలా తిరుగుతున్న వారిని హెచ్చరించేందుకు తగిన పర్యవేక్షణ లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* నగరంలో ఆదివారం నాటి పరిస్థితులను చూస్తే రోజురోజుకూ చేయి దాటిపోతుందా అన్నట్లు వీధులు కనిపించాయి. మార్కెట్లను అనుసంధానించే రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసి కనిపించాయి. ఎవరూ వ్యక్తిగతంగా సామాజిక దూరం పాటిస్తున్నట్లు కనిపించలేదు. ఎవరికివారు నచ్చినట్లు వెళ్లివస్తున్నారు.

* వీధుల్లో మార్కెట్లు, బజార్ల వద్ద కొందరు పాటిస్తున్నా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రోడ్ల మీద పెట్టిన కూరగాయల దుకాణాల వద్ద గుమిగూడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

* సూపర్‌మార్కెట్లు, మందుల దుకాణాలు, రైతుబజార్లు, పోలీసులు ఉన్న చోట మాత్రమే అత్యధికంగా సామాజిక దూరం పాటిస్తుండగా మిగిలిన చోట్ల వదిలేస్తున్నారు. ఆదివారం మాంసం, చేపల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరి కనిపించారు.

* అధికారులు మార్కెట్లు, బజార్ల తనిఖీల సమయంలో వారు సామాజిక దూరం పాటిస్తూ క్షేత్రస్థాయిలో పాటించేలా చైతన్యం తెస్తే మరికొంత ఫలితమిచ్చే అవకాశం ఉంటుంది.

* మధ్యాహ్నం ఒంటిగంట వరకు గుంపులు గుంపులుగా తిరుగుతున్న ప్రజల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

* దొండపర్తి, సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, జగదాంబ, పూర్ణామార్కెట్‌, మాధవధార, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, మర్రిపాలెం, గాజువాక.. ఇలా ప్రతి ప్రాంతంలో జనం రోడ్ల మీదకు వచ్చారు. సాధారణ రోజులు మాదిరి రోజూ వచ్చి సరకులు తీసుకు వెళ్తుండడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

సరైన పర్యవేక్షణ లేకుంటే..

లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై పోలీసులు తనిఖీ చేస్తున్నా, మినహాయింపుల కారణంగా ఏమీ చేయలేక పోతున్నారు. కొద్ది రోజులుగా తగినంత విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తుండడంతో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరం అత్యావశ్యకం. దాన్ని ప్రజలంతా పాటిస్తున్నారా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.

ప్రస్తుతం ఈ పర్యవేక్షణకు ప్రతి వార్డు, మార్కెట్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ సిబ్బందిని నియమిస్తేగాని మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం ఆ దిశగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo