ఏపీ పీజీఈసెట్‌లో సత్తాచాటిన విద్యార్థులు

ఏపీ పీజీఈసెట్‌లో సత్తాచాటిన విద్యార్థులు

ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ పీజీ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో పెందుర్తి ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు.
పరిశోధన, అభివృద్ధి ఇంజినీరు కావాలని…
●పేరు: గట్టి శ్రీసంగేశ్వర సాయికృష్ణ
●ఊరు: గాంధీనగర్, పెందుర్తి
●చదువు: బీటెక్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్
●ర్యాంకు: కెమికల్ ఇంజినీరింగ్‌లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు
●కుటుంబ నేపథ్యం: తండ్రి సుబ్రమణ్యం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి అన్నపూర్ణ గృహిణి.
●చదివిన తీరు: పరీక్షకు నాలుగు నెలలు ముందుగా ప్రత్యేక ప్రణాళికతో చదివాను. బీటెక్‌లోని సబ్జెక్టులపై పట్టుపెంచుకోవడంతోపాటు పాత ప్రశ్నాపత్రాలను సాధన చేశా. పరిశోధన, అభివృద్ధి ఇంజినీరింగ్‌లో ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం
ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే లక్ష్యం
●పేరు: వంతినిబ రాజు
●ఊరు: పెందుర్తి బ్యాంకు కాలనీ, పాడేరు నుంచి వలస వచ్చారు.
●చదువు: బీటెక్ ఇన్స్ట్రుమెంటల్
●ర్యాంకు: ఇన్స్ట్రుమెంటల్లో రాష్ట్రస్థాయి 10వ ర్యాంకు
●కుటుంబ నేపథ్యం: తండ్రి వెంకటేశ్వర్లు జీవీఎంసీలో పనిచేస్తున్నారు. తల్లి పార్వతి గృహిణి.
●చదివిన తీరు: బీటెక్ పుస్తకాల్లో బేసిక్స్ బాగా చదివాను. రిఫరెన్స్ పుస్తకాలను చదివి సాధన చేసేవాడిని. ఇన్స్ట్రుమెంటల్ చాలా కీలకమైన సబ్జెక్టు. ఆ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం.
పీజీఈసెట్‌లో గాజువాక బాలిక ప్రతిభ
మంగళవారం విడుదలైన ఏపీపీజీఈసెట్ జియో-ఇంజినీరింగ్ విభాగంలో గాజువాక చైతన్యనగర్‌కు చెందిన సయీద్ మునీరా రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు.
ఈమె ఏయూలో బీటెక్ పూర్తి చేసి మూడు నెలల పాటు హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ తీసుకున్నారు. తండ్రి సయీద్ అన్వర్ బాషా స్టీల్‌ప్లాంటులో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటి వద్దే శిక్షణ తీసుకున్నట్లు మునీరా తెలిపారు.
పది ఫలితాల్లో తిరుమల విజయభేరీ
తగరపువలస సమీప తాళ్లవలసలోని తిరుమల ఆంగ్ల మాధ్యమ పాఠశాల స్థాపించిన మొదటి ఏడాదే పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు.
ఈ పరీక్షలకు హాజరైన మొత్తం 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై నూరుశాతం ఫలితాలు సాధించామన్నారు. వీరిలో ఆరుగురికి పదికి పది పాయింట్లు, తొమ్మిది మందికి 9.8, పదహారు మందికి 9.5, 23 మందికి 9.2 గ్రేడ్ పాయింట్లు వచ్చాయన్నారు. విజేతలను ఛైర్మన్, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు.