News

Realestate News

రూ.710 కోట్లతో యువతకు సంక్షేమ పథకాలు

world wind utsav, visakhapatnamrealestate news

మైనార్టీ సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు హిదాయత్‌ వెల్లడి

వన్‌టౌన్‌:

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంస్థ అధ్యక్షులు మొహ్మద్‌ హిదాయత్‌ వెల్లడించారు. మైనార్టీల సంక్షేమ కార్యక్రమాల కోసం ఏడాదికి రూ.710 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. నగర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం గవర్నర్‌ బంగ్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. వ్యాపార పథకాలకు రాయితీతో కూడిన రుణాలను ఇస్తున్నామని చెప్పారు. దుల్హన్‌ పథకం కింద ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్లు జరిగితే రూ.50వేల నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నట్లు చెప్పారు. విదేశీ చదువుకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు రూ.10లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. నెల్లూరు, విజయవాడల్లో జాబ్‌మేళాలను నిర్వహించి 700 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.

త్వరలో విశాఖలో జాబ్‌ మేళా నిర్వహించి ఎన్టీపీసీ, హిందుజా వంటి సంస్థల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన భూములను ఎన్టీపీసీ, హిందుజా సంస్థలు తీసుకున్నాయని, కనీసం పదిశాతం వరకు ఆయా సంస్థల్లో మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దుకాన్‌ ఔర్‌ మకాన్‌ పథకం కింద రూ.3.75లక్షల విలువ చేసే యూనిట్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రోష్మి పథకం కింద చిల్లర వ్యాపారులకు రూ.50వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డుకు 7,800 ఎకరాల భూములున్నాయని, 2,598 ఎకరాలు హిందుజా, ఎన్టీపీసీ సంస్థలకు కేటాయించామని, ఇంతవరకు రూ.40కోట్లు పరిహారంగా వచ్చిందని, ఇంకా రూ.10కోట్లు రావల్సి ఉందని పేర్కొన్నారు.
2152 ఎకరాల భూములను వివిధ సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నాయని, 2226 ఎకరాల భూములు వక్ఫ్‌బోర్డు అధీనంలో ఉన్నాయని వివరించారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌, వక్ఫ్‌బోర్డు సభ్యులు కిర్మానీ సబ్దా, నర్గీస్‌, రఫి, హానిఫ్‌, చినరెహ్మాన్‌, మైనార్టీ సంక్షేమ సంస్థ అధికారులు ప్రభాకరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.