News

Realestate News

నేడు వైద్యారోగ్య మంత్రి సమీక్ష

Review Minister of Health today.

నేడు వైద్యారోగ్య మంత్రి సమీక్ష

అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో ఓపీ చీటీల కోసం బారులు

ప్రభుత్వాసుపత్రులకు ఏటా రోగుల తాకిడి పెరుగుతోంది. అందుకు తగ్గ వసతులు పెరగడం లేదు. వైద్యులతో పాటు ఇతర సిబ్బంది ఖాళీలు అధికంగా ఉన్నాయి.

మరోవైపు గత ఆరు నెలలుగా ఆసుపత్రుల్లో మందులకూ కొరత వచ్చిపడింది. మొత్తంగా జిల్లాలో ప్రజారోగ్యం కొడిగట్టిన దీపంలా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) జిల్లాలో వైద్యారోగ్య శాఖల పనితీరుపై సమీక్షించడానికి శనివారం జిల్లాకు వస్తున్నారు.

ఆయన సమీక్షలోనైనా తగిన నిర్ణయాలు తీసుకుంటే సేవలు మెరుగుపడతాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జ్వరం మాత్రలు కూడా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోతున్నారు. గత రెండు త్రైమాసికాలకు సంబంధించి జిల్లా మొత్తంగా 60 లక్షల పారాసిట్మాల్‌ మాత్రలు అవసరమైతే 18 లక్షలు మాత్రమే వచ్చాయి.

అవి కూడా మలేరియా పథకంలో వస్తే వాటిని ఆసుపత్రులకు సర్దుబాటు చేశారు. రెండు నెలల క్రితం ఓ కంపెనీకి చెందిన మాత్రలు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు వచ్చినా ఆ మాత్రల నాణ్యత బాగోలేదని రిపోర్టు రావడంతో వాటిని పక్కన పడేసి కడప, ప్రకాశం ఇతర జిల్లాల నుంచి కొద్దికొద్దిగా అప్పులు తెచ్చి సర్దుబాటు చేస్తున్నారు.

*కుక్కకాటుకు ఉపయోగించే ఏఆర్వీ ఇంజెక్షన్లు అరకొరగానే వచ్చాయి. గతేడాది 30 వేల వైల్స్‌ జిల్లాకు వస్తే ఈ ఏడాది ఆరు నెలలకు కేవలం ఆరు వేలు మాత్రమే వచ్చాయి. వీటిని అవసరాన్ని బట్టి సరఫరా చేస్తున్నారు.

* టెట్వాక్‌ ఇంజెక్షన్ల సరఫరా మూడు నెలలుగా నిలిచిపోయింది.

* జ్వరాలు, అతిసార వ్యాధి బాధితులకు విధిగా పెట్టాల్సిన సెలైన్‌ బాటిళ్లు జిల్లాలో లేవు. రెండు రోజుల క్రితం ఏడు వేల సీసాలను ప్రకాశం జిల్లా నుంచి తెప్పించారు.

*●అత్యవసర కేసుల్లో ఉపయోగించే హెమాసిల్‌ ఐవీ సరఫరా ఏడాదిగా నిలిచిపోయింది. ఈ మందు బయట మార్కెట్‌లో రూ.270 ఉంటుంది. అయితే మందుల కొరత ఉన్నా ఆసుపత్రుల డ్రగ్స్‌ బడ్జెట్‌ నుంచి బయట కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉంచాలని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఈ విధంగా కొనుగోలు చేస్తున్నా మరికొందరు ఈ ఖర్చుకూ వెనకడుగు వేస్తున్నారు.

*జిల్లాలో వైద్య విధాన పరిషత్తు, జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 12 సామాజిక, మూడు ప్రాంతీయ, ఒక జిల్లా, ఒక బోధనాసుపత్రులు ఉన్నాయి. ప్రతి నెలా రెండు లక్షలకు పైబడి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. వీరిలో సుమారు 13 వేల మంది ఇన్‌ పేషంట్లుగా ఆసుపత్రుల్లో చేరి వైద్యసేవలు పొందుతుంటారు.

వీరి సేవలకు అవసరమైన వైద్య నిపుణులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. ముఖ్యంగా ఏజెన్సీలో పాడేరు, అరకు ప్రాంతీయ ఆసుపత్రుల్లో కనీసం నలుగురేసి వైద్య నిపుణులు ఉండాలి.

ఒక్క నిపుణుడూ లేరు. కేవలం ఎంబీబీఎస్‌ వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా ఆసుపత్రులకు వచ్చిన అధునాతన వైద్య పరికరాలు వినియోగానికి నోచుకోకుండా వృథాగా పడి ఉంటున్నాయి.

ఉన్న అరకొర వైద్యులతోనే సేవలు అందించాల్సి రావడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారు కూడా కొన్ని సందర్భాల్లో చేతులెత్తేస్తున్నారు. అత్యవసర వేళల్లో కేజీహెచ్‌కే తరలించాల్సి వస్తోంది.

ఆసుపత్రుల్లో పడకలు పెరగకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి వైద్యం అందించే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా నేతలు ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

*అనకాపల్లి జిల్లా ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200కు పెంచారు. ఈ ఆసుపత్రికి నెలకు 25 వేలకు రోగులు తనిఖీలు వస్తుంటారు. 2,500 మంది వరకు ఇన్‌ పేషంట్లుగా చేరుతుంటారు.

అయితే ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం 100 పడకలకు ఉండాల్సిన వైద్యులు కూడా లేకపోవడంతో ఉన్నవారిపైనే ఒత్తిడి పెరుగుతోంది. పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం జరిగితే మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుంటుంది.

*నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు పెంచారు. అందుకు అనుగుణంగా వైద్యుల నియామకం జరగలేదు. ఈ ఆసుపత్రిలో ప్రతినెలా 400కు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రాంతీయ ఆసుపత్రుల్లో రాష్ట్రంలోనే ఇక్కడే ఎక్కువ ప్రసవాలు జరుగుతాయన్న గుర్తింపు ఉంది. పోస్టులు పెంచకపోవడంతో సరైన వైద్యం అందించలేకపోతున్నామని ఆసుపత్రి వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.

*పాడేరు, అరకు ప్రాంతీయ ఆసుపత్రులదీ ఇదే దుస్థితి. పాడేరులో 200 పడకలు, అరకులో 100 పడకల ఆసుపత్రులున్నా వాటి కంటే మైదాన ప్రాంతంలోని సామాజిక ఆసుపత్రులే మిన్నగా సేవలందిస్తాయి.

వైద్య నిపుణులు ఎవరూ లేకపోవడంతో అత్యవసర సేవలకు వంద కి.మీ.పైగా దూరానున్న కేజీహెచ్‌కే తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో పాడేరు ఆసుపత్రికి భారీగా పోస్టులు మంజూరు చేసినా ఆఖరి నిమిషంలో నిలిచిపోయాయి.