పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న జూనియర్ వైద్యులు తమ ఆందోళనను శుక్రవారం మధ్యాహ్నం విరమించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్ చట్టానికి వ్యతిరేకంగా జూడాలు జులై 31 నుంచి సమ్మెకు దిగారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. వీరి ఆందోళనకు వైద్య విద్యార్థులు జతకలిశారు. విశాఖలోని కేజీహెచ్‌తో సహా వీజీహెచ్, టీబీహెచ్, ఆర్ఈహెచ్, మెంటల్‌కేర్, ఆర్సీడీ, ఈఎన్టీ తదితర ఆసుపత్రులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది.
గత కొద్దిరోజుల నుంచి కేజీహెచ్‌లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. జూనియర్ వైద్య సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
ఎన్ఎంసీ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై ఆయా సంఘాల ప్రతినిధులు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వైద్య బిల్లునుంచి వాటిని మినహాయించాలని కోరుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
దీంతో నిరవధిక సమ్మెను విరమించామని జూడాల అధ్యక్షుడు డాక్టర్ దీప్‌చంద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించారు.
ఈలోపు అమరావతిలో జరుగుతున్న చర్చలు ఫలప్రదమైనట్లు సమాచారం రావడంతో సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి కేజీహెచ్‌లో తమ సేవలను పునరుద్ధరించారు. శనివారం నుంచి యథావిధిగా ఓపీలు, ఆపరేషన్ థియేటర్లు పనిచేస్తాయని కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ అర్జున తెలిపారు.