News

Realestate News

ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయం

Protection public lands.Minister Muttamchetti Srinivasa Rao

ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయం

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎం.శ్రీనివాసరావు,

చిత్రంలో కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తదితరులు

 విశాఖను పర్యటకంగా అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, యువజన, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ బంగ్లాలో రెవెన్యూ, పర్యటక, యువజన సర్వీసుల శాఖలకు చెందిన అధికారులతో మంత్రి సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖలో భూముల ధరలు అమాంతం పెరగడంతో కొంతమంది ప్రజాప్రతినిధులు, స్థానికులు ఏకమై ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు.

ఆయా ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ వేసిందని, ఆ నివేదిక ఆధారంగా కొంతమంది రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశారన్నారు. సిట్‌ నివేదికను మరోసారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైతే రీఓపెన్‌ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని, నిజాయితీ, నిస్వార్థంగా పనిచేసే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూములు, స్థలాలు, ఇళ్లను ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చాయని, అలాంటి వారిపై చర్యలను తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

 

అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి…

రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని, ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రేషను డిపోల్లో అక్రమాలు అధికంగా జరుగుతున్నాయని, డివిజన్ల వారీ సమీక్షలు జరిపి అక్రమాలను అడ్డుకోవాలన్నారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేసి అవినీతి రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దాలన్నారు.

 

పర్యటక ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి…

రాబోవు రోజుల్లో నూతన పర్యటక ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో పర్యటక శాఖ వద్ద 355 ఎకరాల స్థలం ఉందని, వీటిలోని 60 ఎకరాల్లో పది ప్రాజెక్టులను చేపట్టబోతున్నామని చెప్పారు. పీపీపీ తరహాలో వీటిని ఏర్పాటుచేస్తామన్నారు.

రేవుపోలవరం, పరవాడ, యారాడ, ముత్యాలమ్మపాలెం, పూడిమడక, దబ్బంద ప్రాంతాలతో పాటు మన్యంలోనూ పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయన్నారు. రూ. 280 కోట్ల కేంద్ర నిధులతో చేపట్టనున్న పర్యటక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే పట్టాలెక్కిస్తామన్నారు. తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

 

క్రీడల అభివృద్ధిపై…

విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం నిర్మాణం ప్రారంభించామని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. అమరావతి, తిరుపతిల్లో ఇలాంటివి వస్తాయన్నారు. విశాఖకు సంబంధించి అగనంపూడి మూడు రోడ్ల కూడలిలో 150 ఎకరాలు గుర్తించామని, దీనిలో 80 ఎకరాల సేకరణ పూర్తయిందన్నారు.

పీపీపీ తరహాలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేసీ-2 వెంకటేశ్వరరావు, డీఆర్వో గున్నయ్య, ఆర్డీవోలు తేజ్‌భరత్‌, సూర్యకళ, గోవిందరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి పూర్ణిమాదేవి, సెట్విస్‌ సీఈవో గీతాంజలి, జిల్లా క్రీడాధికారి జూన్‌ గాల్లోయట్‌ తదితరులు పాల్గొన్నారు.