Polling up to night In Komalpudi
రాత్రి వరకు కొనసాగిన పోలింగ్

కోమళ్లపూడిలో రాత్రి 7 గంటలు దాటినా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి ఉన్న ఓటర్లు
బుచ్చెయ్యపేట, రావికమతం, దేవరాపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం కొంతసేపు ఈవీఎంలు మొరాయించాయి.
దాంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం గంటపాటు ఆలస్యం కావడం, తర్వాత కూడా మందకొడిగా సాగడంతో సాయంత్రం ఆరు దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారిని చీటీలు రాసిచ్చి ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు. బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురం, కోమళ్లపూడి, మంగళాపురం, మల్లాం, ఆర్.భీమవరం, రాజాం, పెదమదిన, గున్నెంపూడి గామాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.
కోమళ్లపూడి, ఆర్.శివరాంపురం గ్రామాల్లో రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా 200 చొప్పున పైగా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉండలేక వారంతా ఇబ్బందులు పడ్డారు.
పోలింగ్ బాగా ఆలస్యం కావడంపై పోలింగ్ సిబ్బందిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావికమతం మండలం కొత్తకోటలో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.
దేవరాపల్లి మండలం రైవాడలో దాదాపు రాత్రి ఎనిమిదిన్నర సమయానికి సుమారు 200 మంది ఓటర్లు ఇంకా ఓటు వేసేందుకు ఉన్నారు. డీఎస్పీ బి. సునీల్ దగ్గరుండి పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రం సిబ్బంది నెమ్మదిగా ఓటింగ్ చేయిస్తున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు గ్రామాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నీలంపేటలో రాత్రి ఏడున్నర గంటలకు 80 మంది వరకు వరసలో ఉన్నారు. గొలుగొండ మండలం కశిమిలో రాత్రి ఎనిమిది తర్వాత సైతం పోలింగ్ కొనసాగుతోంది.
ఆరుగంటల్లోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారందరికీ ఓట్లు వేసే అవకాశం కల్పించారు. దీంతో చాలామంది సాయంత్రం వేళ కేంద్రాలకు వచ్చారు.
డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను తిరిగి స్వాధీనం చేసుకుని శుక్రవారం ఉదయం వరకు భద్రపరుస్తారు. ఆ తర్వాత వాటిని విశాఖపట్నం తరలిస్తారు