News

Realestate News

నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు!

నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు!

పలు సమస్యలపై ‘స్పందన’లో ఫిర్యాదు చేసిన బాధితులు

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన నిరుద్యోగులు

పలు సమస్యలతో ఇక్కట్లు పడుతున్న బాధితులు తమ ఇబ్బందులకు అధికారులకు చెప్పుకోవాలని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ‘స్పందన’ కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాలు ఇచ్చారు.

మాజీ ఎంపీ పీఏనంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసగిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఐఐఎంకు వెళ్లే రహదారి ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాలను అందజేశారు.

ఆ వ్యక్తిని ఉపేక్షించొద్ధు..

గిరిజన ప్రాంతాల్లోని 11 మండలాలకు చెందిన నిరుద్యోగ యవతకు ఉపాధి పేరిట మోసగించిన మాజీ ఎంపీ పీఏగా చెబుతున్న చుక్కా రమేష్‌పై చర్యలను తీసుకోవాలని పలువురు గిరిజన నిరుద్యోగులు కోరారు.

మన్యం నుంచి వచ్చిన కె.సంజీవరావు, కృష్ణవేణి, సన్యాశిరావు తదితరులు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వశిక్షణ అభియాన్‌ సంస్థలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు కల్పిస్తానని, 50 మంది గిరిజన యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని,

ఇదంతా 2018 అక్టోబరు నుంచి నడుస్తోందని, తీరా డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ఆనందపురం మండలం గంభీరం గ్రామం నుంచి ఐఐఎం విద్యా సంస్థకు వెళ్లే 100 అడుగుల రహదారిని ఆక్రమించుకున్న వారిపై చర్యలను తీసుకోవాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన 14 మంది రైతులు కలెక్టర్‌ను కోరారు.

ఈ రహదారి వల్ల తమ గ్రామాలకు వసతులు మెరుగవుతున్నాయని, దీన్ని కొంతమంది అడ్డుకుంటూ రహదారి స్థలాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

* నకిలీ ద్రువీకరణ పత్రాలతో ఎస్టీలుగా చెలామణి అవుతున్న వారిపై చర్యలను చేపట్టాలని అరకువేలికి చెందిన బాబూరావు అనే వ్యక్తి కలెక్టర్‌ను కోరారు.

లైఫ్‌లైన్‌ సంస్థను తెరిపించాలి

ఆనందపురం మండలం పాండ్రంగి గ్రామంలో ఉన్న లైఫ్‌లైన్‌ ఫుడ్స్‌ అండ్‌ ఆగ్రో సంస్థ గత 50 రోజుల నుంచి మూతపడిందని, దీనివల్ల ఇక్కడ ఉపాధి పొందుతున్న 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయని సంస్థ ఉద్యోగులు తెలిపారు.

పాండ్రంగి గ్రామ ప్రజలతో వివాదం కారణంగా సంస్థను మూసివేశారని, సంస్థ యాజమాన్యం, గ్రామస్థులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించి సంస్థ తెరుచుకొనేలా చర్యలను చేపట్టాలని వారు కోరారు.