ముంచుకొస్తున్న ఫొనిముప్పు

ముంచుకొస్తున్న ఫొనిముప్పు
శ్రీకాకుళం జిల్లాపై అధిక ప్రభావం
బంగాళాఖాతంలో ఫొని తుపాను అలజడి సృష్టిస్తోంది. నేడూ, రేపూ ఈ తుపాను తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు.
ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్లోని దిగాకు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగా, శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుపాను మలుపుతీసుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖలు తెలిపారు. ఫొని తుపానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్దఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. గంజాం, కుర్దా, పూరీ, జగన్సింగ్పూర్ జిల్లాలో అలలు ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పోర్టుల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.