పరిమిత సంఖ్యలోనే అనుమతి

పరిమిత సంఖ్యలోనే అనుమతి
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు నిషేధం
ఆదేశాలు జారీ చేసిన ఈసీ
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన బల్లలు
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కించే గదుల్లోకి పరిమిత సంఖ్యలోనే మందిని అనుమతించనున్నారు.
ఈ మేరకు లెక్కింపు కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతించాలనే విషయమై ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 30 గదుల్లో ఓట్లను లెక్కించనున్నారు.
వీటిల్లో 15 అసెంబ్లీ, 15 లోక్‌సభ నియోజకవర్గాలకు కేటాయించారు. ఒక్కో గదిలో లెక్కింపునకు 14 బల్లలతోపాటు ఆర్ఓ, ఏఆర్ఓ, కేంద్ర ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, అభ్యర్థుల తరఫు ఏజెంట్ల కోసం మరో బల్ల ఏర్పాటు చేస్తారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నాలుగు బల్లలు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.
* అభ్యర్థుల తరఫున ఒక్కో బల్లకు ఒకరు చొప్పున 14 మంది ఏజెంట్లు, పోస్టల్ బ్యాలెట్‌కు ఒకరు, చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, అభ్యర్థితో కలిపి మొత్తం 17మందిని అనుమతించనున్నారు.
వీరందరికీ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. ఆయా కార్డులతో లెక్కింపు చేపట్టే రోజు ఉదయం 8గంటల లోపు వీరంతా నిర్దేశిత కేంద్రాల వద్దకు చేరుకోవాలి.
వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీ వంటి ఏర్పాట్లను యంత్రాంగమే చేస్తుంది. ఒకసారి లెక్కింపు కేంద్రంలోకి వెళితే పూర్తయ్యాకే తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మధ్యలో వెళ్లిపోతే తిరిగి రావడానికి కుదరదు.
* యంత్రాంగం తరఫున ఆర్ఓ, ఎఆర్ఓలు, ఒక బల్లకు ముగ్గురు చొప్పున లెక్కింపు సిబ్బందిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. వీరికీ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు ఇస్తారు.
వీరితో పాటు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చేందుకు అవసరమైన సిబ్బందిని అనుమతిస్తారు.
* కేంద్ర ఎన్నికల పరిశీలకుని సమక్షంలో లెక్కింపు ప్రక్రియ మొత్తం జరగనుంది. ప్రతి లెక్కింపు కేంద్రానికి రెండేసి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
* లెక్కింపు కేంద్రం లోపలకు చరవాణిలు, ల్యాప్‌ట్యాప్‌లు వంటి ఉపకరణాలను అనుమతించరు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను పెడుతున్నారు.
* లెక్కింపు ఏజెంట్లుగా అభ్యర్థులు సూచించిన వ్యక్తులనే నియమిస్తారు. ఆయా ఏజెంట్ల పూర్వాపరాలపై పోలీసు యంత్రాంగం విచారణ చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే నియామకాలు చేపట్టనున్నారు.
* ఏజెంట్ల వివరాలను అధికారులకు అభ్యర్థులు అందజేస్తున్నారు. ఇంకా 13రోజులే గడువు ఉండడంతో లెక్కింపు ఏర్పాట్లపై యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.