విశాఖకు కొత్త ప్రాజెక్టులు

త్వరలో ఆకర్షణీయ పనులు ప్రారంభం
నగరాభివృద్ధిపై అమెరికాలో చర్చ
కార్పొరేషన్ :
విశాఖకు కొత్తగా మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి అనుమతి లభించడంతో, వాటికి సవివర పథక నివేదిక(డీపీఆర్)లను తయారు చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…
ఆ మూడు ప్రాజెక్టులు ఇవే…
ప్రాజెక్టు-1: విశాఖ-చెన్నై పెట్రో కారిడార్ నిర్మాణంలో భాగంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రూ.340 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ నిధుల్లోని కొంతమొత్తంతో నగరంలో పైపులైన్ల లీకేజీల ద్వారా పోతున్న నీటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. నగరానికి చేరుకున్న శుద్ధి చేసిన నీరు లీకేజీల ద్వారా అధిక మొత్తంలో లీకవుతున్నట్లు గుర్తించాం. వాటన్నింటికీ మరమ్మతులు చేస్తాం.
ప్రాజెక్టు-2: ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి ఆర్థిక సంస్థ(ఏపీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ.500 కోట్లతో మల్కాపురం, గాజువాకల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టు
ప్రాజెక్టు-2: ఉత్తర, పశ్చిమ, మధ్య నగర ప్రాంతాల్లో ‘అమృత్’కు చెందిన రూ. 150 కోట్లతో మంచినీటి పైపులైన్ల నిర్మాణం చేపడతాం.
‘షికాగో’ సమావేశాన్ని సద్వినియోగం చేసుకున్నాం…
అమెరికాలోని షికాగోలో ఇటీవల ఆకర్షణీయ నగరాల సమావేశానికి హాజరయ్యాం. నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాం. దేశంలోని మరే ఇతర నగర ప్రతినిధులకు ఆహ్వానం లభించలేదు. భారతదేశంలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధితోపాటు, నగరంలో చేపడుతున్న ప్రాజెక్టులను వివరించాం. అలాగే అక్కడ వినియోగిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా నగరంలోని భవనాలను పరిశీలించాం. ఈ సమావేశానికి హాజరుకావడం మంచి అనుభవం. అయితే నగరాభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంపై చర్చ జరిగినా, అది ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ముందుంటాం…
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాం. దేశంలో మరే నగరంలో లేనివిధంగా వార్డులన్నింటినీ మల విసర్జన రహితం(ఓడీఎఫ్)గా చేయడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే నగరాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత ఏడాది 78 నగరాలతో పోటీ పడగా, మనకు 5వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం 400 నగరాలతో పోటీలో ఉన్నాం. మంచి ర్యాంకు సాధించడానికి అన్నిస్థాయుల్లోనూ కృషిచేస్తున్నాం.
‘ఆకర్షణీయ పాఠశాలలు’…
ఆకర్షణీయ నగర ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించి ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)’ను ప్రభుత్వానికి సమర్పించాం. ఆకర్షణీయ ప్రాంతంలోని జీవీఎంసీకి చెందిన పాఠశాలలను ఆధునిక స్కూళ్లుగా రూపొందిస్తాం. ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకుల సలహాలు తీసుకుంటాం. ఆకర్షణీయ పనులకు సంబంధించి ప్రాజెక్టు మానిటరింగ్ సెల్(పీఎంసీ), ఎస్పీవీని ఏర్పాటుచేశాం. నడక మార్గాల అభివృద్ధి, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, 24 గంటల నీటి సరఫరా వంటి పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ) ఆకర్షణీయ ప్రణాళికల్లో రవాణా, నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలను తీసుకుంటున్నాం. నిధులు సమకూరితే ఆయా పనులను ప్రారంభిస్తాం.
పెద్దనోట్లు రద్దు వల్ల జీవీఎంసీకి రూ.14.5 కోట్లు ఆస్తి పన్ను ఆదాయం లభించింది.
షీలానగర్ నుంచి ఆదర్శనగర్ వరకూ జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా హనుమంతువాక వద్దనున్న గెడ్డపై వంతెనను రూ. 90 లక్షలతో విస్తరించి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాం.
భూగర్భ మురుగునీటి వ్యవస్థ, శీఘ్ర రవాణా వ్యవస్థ పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జాప్యానికి భూ వివాదాలు కారణంగా నిలుస్తున్నా, వాటికి పరిష్కారాలు కనుగొంటున్నాం.
నగరంలో ఎల్ఈడీల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. సీసీఎంఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. ఇంకా ఏడు వేల దీపాలు నగరానికి రావాల్సి ఉంది.
జీవీఎంసీలో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు, పది పంచాయతీలకు సంబంధించి విలీన ప్రక్రియపై ఇటీవల వివరాలు పంపించాం. నగర జనాభా, ఇతర వివరాలను ప్రభుత్వానికి నివేదించాం.