News

Realestate News

Narayanasvaminayudu bobbili assembly constituency

Senior leader Patiwada Narayana Swami Naidu has won seven MLAs from 1983 till now.


మీ వెనుక జనం ఘనం ఇక ముందు మనం మనం

 ఎన్నికల వేళ ద్వితీయ శ్రేణి నేతలకు ప్రాధాన్యం

 ప్రజా బలమున్నవారిని ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు

 ఓటర్లను ప్రభావితం చేయగలిగేవారికి పెద్దపీట

DSDD

* సీనియర్‌ నేత పతివాడ నారాయణస్వామినాయుడు 1983 నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఒక్కసారే ఓటమి పాలయ్యారు. అదీ 597 ఓట్ల వ్యత్యాసంతోనే.

* 1989లో బొబ్బిలి నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో 84,419 ఓట్లు చెల్లుబాటవగా దాంట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.జగన్నాథరావు 41,809 ఓట్లు, తెదేపా అభ్యర్థి ఎస్‌.వి.సి.ఎ.నాయుడు 41,711 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే విజయాన్ని తేల్చింది కేవలం 98 ఓట్లే.. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు.

ఈనాడు-విజయనగరం: వారెవరూ చట్టసభల్లో సభ్యులు కాకపోవొచ్చు. ఒక్కసారైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయకపోయి ఉండొచ్చు. పేరుకి ద్వితీయశ్రేణి నేతలే కావొచ్చు. కాని ఎవరికివారే ప్రజాబలమున్న నేతలు. తలచుకుంటే వేల ఓట్లు అటు నుంచి ఇటు తిప్పేయగల ఘనులు.

అందుకే అలాంటి దిగువస్థాయి నేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయపక్షాల పోటీదారులున్నారు. ఓవైపు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు గ్రామ, మండలస్థాయికి చెందిన కీలక నేతలతో భేటీ అవుతూ తమవైపు పనిచేసేలా ఒప్పించుకుంటూ విజయానికి దగ్గరి దారి వేసుకుంటున్నారు.

ఒకే నియోజకవర్గంలో పదవులతో సంబంధం లేకుండా కొన్ని వేల ఓట్లు ప్రభావితం చేయగల వ్యక్తులుంటే వారిని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులెవరైనా వదులుకుంటారా? వారిని ప్రసన్నం చేసుకుని తమతో కట్టేసుకోకుండా ఉండగలరా? ప్రస్తుతం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య అంతర్గతంగా ఇదే పోరు సాగుతోంది.

భారీగా ఓటర్లను ప్రభావితం చేయగల సామర్థ్యమున్న ద్వితీయ శ్రేణి నేతలపై బరిలో ఉన్న అభ్యర్థులంతా గురి పెట్టారు. అంతేకాదు సొంతపార్టీలోనే ఉన్నా ఇంతకాలం సఖ్యత లేకపోయినా ఇప్పుడు వెళ్లి దగ్గర చేసుకుంటున్నారు.

అందుకే అభ్యర్థులంతా ఓవైపు ప్రచారంలో పాల్గొంటూనే నిత్యం రహస్య సమావేశాలు ఏర్పాటుచేసి మరీ కీలక నేతలతో భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.
మచ్చుకు కొన్ని ..

గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి కొద్దిరోజుల క్రితమే జామి వెళ్లి లగుడు సింహాద్రిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. 85 ఏళ్ల వయసున్న సింహాద్రి రిజర్వేషన్లు కుదరక ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. అయితే ఆయనకు ఎస్‌.కోట, వేపాడ మండలాలతో పాటు జామి మండలంలోని 12 పంచాయతీల్లో మంచి పట్టుంది.

అందుకే ప్రతీ ఎన్నికల్లోనూ ఇటు గజపతినగరం, అటు శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన సహకారం కోరడం ఆనవాయితీగా వస్తోంది.
* రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన అప్పికొండ శ్రీరాములునాయుడు కుటుంబానికి దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన మాజీ ఎంపీపీ అయినా కొట్టక్కితో సహా మరో ఏడెనిమిది పంచాయతీల్లో ప్రభావం చూపించగలరన్న పేరుంది.

అలాగే రామభద్రపురం పంచాయతీ దాదాపు 20 ఏళ్లుగా చొక్కాపు లక్ష్మణరావు కుటుంబం చేతిలోనే ఉంది. వీరిద్దరూ పార్టీ మారతారంటూ ఇటీవలి కాలంలో ఊహాగానాలు రావడంతో బేబినాయన, తెంటు లక్ష్మునాయుడులిద్దరూ స్వయంగా వెళ్లి వారిని కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
* డెంకాడ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. తరువాత వైకాపా కార్యకర్తగా పనిచేశారు. కాని వ్యక్తిగతంగా ఆయనకున్న ప్రజాదరణతో మోపాడ, వెదుళ్లవలస, డెంకాడ, చినతాడివాడ, ఆకులపేట, జొన్నాడ తదితర పంచాయతీల్లో ప్రభావం చూపించగలరన్న పేరుంది.

అందుకే డెంకాడ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యే మనవడు పతివాడ రామకృష్ణ రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపి ఇటీవలే తెదేపాలోకి తీసుకొచ్చారు.
* చీపురుపల్లి మేజర్‌ పంచాయతీలో జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడికి పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతం ఓటు బ్యాంకు ఉంది.

కిమిడి మృణాళిని కుటుంబానికి టికెట్‌ ఇవ్వడాన్ని ముందులో వరహాలనాయుడు వ్యతిరేకించారు. అయితే ఇటీవలే కిమిడి కుటుంబ సభ్యులంతా వరహాలనాయుడుతో చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేసేలా ఒప్పించారు.