Nara Lokesh with students in ITsector

ఉద్యోగావకాశాలొస్తున్నాయి…
నాణ్యమైన విద్యను తీసుకొచ్చాం
విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి నారా లోకేష్
ఈనాడు – విశాఖపట్నం
తెదేపా ప్రభుత్వం నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కల్పనకు పెద్ద పీట వేస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనతో పాటు పాఠ్యాంశాల్లోనూ మార్పు తీసుకురావాల్సి ఉంది.
కోర్సులు పూర్తి చేసి బయటకొచ్చిన విద్యార్థి వెంటనే ఉద్యోగాలు పొందేలా తగిన కృషి చేస్తాం.
– ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్.
విద్యావ్యస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడానికి వచ్చే ప్రభుత్వంలో నారా లోకేష్ విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు తీసుకుని సంస్కరణలు అమలు చేయాలని తెదేపా లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్ ఆకాంక్షించారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో తెదేపా లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
ఉన్నత విద్యారంగంలోని సమస్యలు, ఉపాధి అవకాశాల కల్పన, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పెందుర్తి తెదేపా అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.
ప్రశ్న: నా పేరు లహరి, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నా. మా రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. విశాఖ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.
మాకు స్థానికంగానే అవకాశాలు కల్పించాలి.?
లోకేష్: రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా ప్రాజెక్టులు రావాల్సి ఉంది. హోటల్స్ వస్తున్నాయి. ఇందుకు కొత్త విధానాలను తీసుకురానున్నాం. ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు చాలా సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి.
ఇంతకుముందు హోటల్స్ సంఘ ప్రతినిధులతో మాట్లాడా. ఇక్కడ ఉపాధి అవకాశాలున్నాయని వారు చెప్పారు. మీరేమో లేవని అంటున్నారు. ఈ అంతరంపై అధ్యయనం చేస్తాం. హోటల్స్ సంఘ సభ్యులు ప్రభుత్వ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పడి యువతకు శిక్షణ ఇస్తే కొరతను అధిగమించొచ్చు.
ప్రశ్న: నా పేరు లక్ష్మి. తరచూ బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాం? రాజకీయ పార్టీలు బహిరంగసభలు నిర్వహించినపుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కోసారి మూడు నుంచి అయిదు గంటలు నిరీక్షిస్తున్నా దొరకటం లేదు.
లోకేష్: సమస్య వాస్తవమే. ప్రజాస్వామ్య దేశంలో తప్పదు. ఏ పార్టీ అయినా సమావేశాలను నిర్వహించినపుడు అవసరమైన బస్సుల కోసం డబ్బు చెల్లించే తీసుకుంటుంది. ఇకపై పార్టీకి సంబంధించిన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే వారాంతాల్లో ఉండేలా చూస్తాం.
ఈ ఎన్నికల హడావుడిలో కొద్ది రోజులు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక దీనిపై తప్పక ఆలోచన చేస్తాం.
ప్రశ్న: నా పేరు అన్నపూర్ణ. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా సమస్యలున్నాయి. వాటిని ఏవిధంగా పరిష్కరించనున్నారు? మౌలిక వసతుల కల్పనకు ఏం చేస్తున్నారు?
లోకేష్: పాఠశాలల్లో వసతుల కల్పనకు ఇప్పటికే రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. డిజిటల్ బోధన విధానాన్ని తీసుకొచ్చాం. వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల కొరత సమస్యను అధిగమించి సీట్లన్నీ నిండే స్థాయికి తీసుకొచ్చాం.
ప్రశ్న: ఏటా ప్రయివేటు విద్యాలయాలు ఫీజులు పెంచుతూనే ఉంటున్నాయి. దీనికి పరిష్కారం లేదా ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? సిలబస్ మార్చాలి.
లోకేష్: ప్రయివేటు విద్యాలయాలను నియంత్రించాలంటే ప్రభుత్వ విద్యాలయాలను ప్రోత్సహించాలి. ఇందుకు నిబద్ధతతో పని చేస్తున్నాం.
అంగన్వాడీల నుంచి కళాశాలల వరకు అన్ని స్థాయుల్లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పిల్లలు ప్రయివేటుకు మళ్లకుండా ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నాం.
అధిక రుసుముల వసూళ్లపై దృష్టి సారిస్తాం. పాఠ్యాంశాల్లో మార్పులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరిస్తాం
అంతకుముందు మంత్రి లోకేష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా ఎన్నో అనుబంధ పరిశ్రమలు వచ్చాయన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు కొత్త పరిశ్రమల ఏర్పాటులో సమస్యలు, భూముల కేటాయింపు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రభుత్వ ఏర్పాటు తరువాత వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.