News

Realestate News

ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ముఖేష్ అంబానీ..

ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ముఖేష్ అంబానీ..

                                                      

భారత కుబేరుల్లో ప్రథముడిగా గత కొన్నేళ్లుగా రికార్డు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తాజాగా ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు.

ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం లభించింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ఆయనకు 9వ స్థానం దక్కింది. ముకేశ్‌ అంబానీ నికర సంపద 64.5 బిలియన్ డాలర్లుగా సదరు సంస్థ పేర్కొన్నది. ప్రపంచ సంపన్నుల జాబితాలోకెక్కే క్రమంలో ముకేశ్‌ అంబానీ ..

ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్‌​లను అధిగమించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) ఉన్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్‌ వ్యాఖ్యానించింది.

ముఖేష్‌ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్‌ తయారీదారు సైరస్‌ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్‌ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది.

కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నప్పటికి ముకేశ్‌ అంబానీ జియో ప్లాట్ ఫామ్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

రిలయన్స్‌లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల పుణ్యమా అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చేశారు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిని నమోదు చేసింది. 

వరుసగా 13వ సారీ నంబర్ వన్ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.

భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో ముఖేష్‌ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ ఇండియా 2020 కుబేరుల లిస్టులో వరుసగా పదమూడోసారీ నంబర్‌ వన్‌గా నిల్చారు. గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో ముఖేష్‌ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం.

ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్‌ ఇండియా జాబితాలో ముఖేష్‌ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్‌ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

ఇక ముకేష్‌ అంబానీకి ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల్లో 27 అంతస్తుల ఇంద్రభవనం అంటిలియా ఉంది. అంటిలియా నిర్మాణ వ్యయం వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల డాలర్లుంటుందని అంచనా. ఈ ఇంటిలో పార్కింగ్ కోసమే ఆరు అంతస్తులు కేటాయించారు.

మూడు హెలిప్యాడ్‌లు, 68 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, క్రిస్టల్ షాన్డిలియర్‌లతో కూడిన గొప్ప బాల్రూమ్, బాబిలోన్‌ ఊగే తోటల స్ఫూర్తితో మూడు అంతస్తుల హ్యంగింగ్ గార్డెన్‌, యోగా స్టూడియో, హెల్త్ స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి సకల హంగులతో వెలుగొందుతోంది.

కాగా వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్‌ ల్యాబ్స్‌ ఎండీ మురళి దివి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రమోటర్ల కుటుంబం, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి , అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి ఉన్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్‌ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది.

‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది’ అని పేర్కొంది. ముకేశ్‌ అంబానీ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది.