News

Realestate News

పాఠశాలలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం


నమ్మండి.. సర్కారీ బడేనండి!

ఒకేరోజు 51 మంది విద్యార్థులు చేరిక!

పాఠశాలలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం

 

ప్రభుత్వ పాఠశాలలనగానే చిన్నచూపు చూస్తూ.. అప్పోసొప్పో చేసి మరీ ప్రైవేటు కాన్వెంట్లకు ఎగబడుతున్న రోజులివి. అలాంటిది ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకేరోజు 51మంది చేరికతో రికార్డు సృష్టించారు.

చీడికాడ మండలంలోని వరహాపురం ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు బాగుండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

శుక్రవారం ఈ పాఠశాలలో వరహాపురంతో పాటు పరిసర గ్రామాలైన తునివలస, చెట్టుపల్లి, పెదగోగాడ, చినగోగాడ నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. తొలిరోజు 51 మంది విద్యార్థులు చేరినట్లు ప్రధానోపాధ్యాయుడు వై.సత్యనారాయణ చెప్పారు.

పెదగోగాడ, చెట్టుపల్లి, చినగోగాడ, తునివలస గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషం. విద్యార్థులు అందరికీ మండల విద్యాశాఖాధికారి కె.గంగరాజు, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ బాపునాయుడు, మాజీ సర్పంచి గొల్లవిల్లి రాజబాబు సమక్షంలో వేడుకగా అక్షరాభ్యాసం చేయించారు. వరహాపురం పాఠశాల జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఎంఈఓ గంగరాజు అభినందించారు.