LV Subrahmanyam, Secretary said Keep an eye on the temptations
ప్రలోభాలపై నిశిత దృష్టి పెట్టాలి
వీసీ ద్వారా మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం
ఓటర్లను ప్రలోభపెట్టేలా చాలా చోట్ల నగదు, మద్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, చీరలు పంపిణీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆదివారం అమరావతి నుంచి సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, డీపీజీ ఠాకూర్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గోదాములన్నచోట్ల ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఓటరు జాబితాల్లో డూప్లికేట్లకు అవకాశం లేకుండా చూడాలన్నారు. నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులునమోదు చేయాలన్నారు.
ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు.
వీవీప్యాట్ యంత్రాలను అదనంగా సరఫరా చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రతాఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
వీసీలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా, ఎస్పీ అట్టాడ బాబూజీ తదితరులు పాల్గొన్నారు.