Isolation ward set up in kgh
కరోనాను ఇలా ఎదుర్కొంటాం

X Isolation ward set up in kgh
● కేజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
● అందుబాటులో అవసరమైన వ్యవస్థలు
కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు
న్యూస్‌టుడే – వన్‌టౌన్ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేజీహెచ్ ఈఎండీ బ్లాకులో 20 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు, ఔషధాలు, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్స్ వంటివి అందుబాటులో ఉంచారు. రోగులను ఆ వార్డుకు నేరుగా పంపేందుకు క్యాజువాల్టీ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. సహాయక బృందాన్ని నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారిని ఇక్కడికి నేరుగా తీసుకొచ్చి ప్రాథమిక పరీక్షలు చేస్తారు. తీవ్రత తక్కువగా ఉన్నవారిని వెనువెంటనే ఇళ్లకు పంపేస్తారు. లక్షణాలు అధికంగా ఉంటే ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ అర్జున ఆధ్వర్యంలో ఆయా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వార్డులో ఉండే పరికరాలు
● ఐసోలేషన్ వార్డులో 20 పడకలున్నాయి. బయో మెడికల్ వ్యర్థాల వర్గీకరణకు రెండు బుట్టలు ఏర్పాటు చేశారు. ఈసీజీ, మల్టీచానల్ మోనిటర్లు, వెంటిలేటరు, మొబైల్ ఎక్స్‌రే యూనిట్, ఐవిఫ్లూయిడ్సు, సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, అవసరమైన ఔషధాలు, వైద్యులు/వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, మాస్కులను అందుబాటులో ఉంచారు. పీపీఈ కిట్స్‌లో గ్లౌజులు, ఏప్రాన్లు, సాస్కులు, ఇతర సామగ్రీ ఉంటాయి. కేజీహెచ్‌లో 300 పీపీఇ కిట్స్, ఎన్95 మాస్కులను అందుబాటులో ఉంచారు.
ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఆరుగురు వైద్య సిబ్బంది, ఆరుగురు భద్రత సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు కేటాయించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. నాలుగు రాపిడ్ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఫిజీషియన్, మైక్రోబయాలజిస్టు, ఎనస్తిస్టు సభ్యులుగా ఉంటారు. ఇలాంటివి నాలుగు బృందాలను సిద్ధం చేశారు
రోగులను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి ఇలా….
ఎ-కేటగిరీ: ట్రావెల్ హిస్టరీ లేకుండా… నామమాత్రమైన లక్షణాలున్నవారికి ప్రాథమిక పరిశీలన జరిపి ఇళ్లకు పంపేస్తారు. ఇళ్ల వద్ద 28 రోజులపాటు వారి కదలికలను పరిశీలనలో ఉంచుతారు. ఈ బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సర్వలెన్సు బృందాలకు అప్పగించారు.
బి- కేటగిరీ: ట్రావెల్ హిస్టరీ ఉండి, విదేశాల నుంచి వచ్చినవారికి ఛాతినొప్పి, దగ్గు, ఆయాసం ఉంటే ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు.
సి- కేటగిరీ: తీవ్రమైన ఛాతినొప్పి, దగ్గు, ఆయాసం, జ్వరం ఉంటే.. పీపీఈల సహాయంతో పరీక్షలు చేసి, ముక్కు, గొంతుల నుంచి ద్రావకాలను సేకరించి కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపుతారు. 48 గంటల వ్యవధిలో నివేదిక వస్తుంది.
పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశాం. ఇంతవరకు ఒక్క కేసు కూడా ఇక్కడికి రాలేదు. అలాగని ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. కరోన వైరస్ వ్యాప్తికి దారితీసే కారణాలు, ఇతర అంశాలపై ఆసుపత్రి ఆవరణలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. – డాక్టర్ జి.అర్జున, పర్యవేక్షక వైద్యాధికారి, కేజీహెచ్