ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా కృష్ణమోహన్
ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా కృష్ణమోహన్

ఆచార్య కె.వెంకటరావుకు అకడమిక్ డీన్‌గా ఉత్తర్వులు అందిస్తున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి
ఏయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అందుకున్న ఆచార్య వి.కృష్ణమోహన్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.కాం, ఎం.బి.ఎ చదివారు.
మార్కెటింగ్ మేనేజ్మెంట్లో పి.హెచ్.డి. చేశారు. 1989-90లో ఒక ఏడాది పాటు అహ్మదాబాద్ ఐఐఎంలో ఫ్యాకల్టీగా పనిచేశారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా 2009-2016గా పనిచేశారు. ఏయూ దూర విద్యా కేంద్రానికి ఎం.బి.ఎ. కోర్సులో పలు పాఠ్యాంశాలు రూపొందించారు.
రెండు ఉత్తమ రీసెర్చ్ పేపర్ అవార్డులు అందుకున్నారు.
ఈనెల ఆరున అప్పటి రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆచార్య బైరాగిరెడ్డిని నియమించారు.
ఆయన పూర్తికాలం కొనసాగుతారని అంతా భావించారు. అయితే పూర్వ వీసీ నాగేశ్వరరావు స్థానంలో ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని వీసీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
రెండు కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారనే విమర్శలు వర్సిటీలో చక్కర్లు కొట్టాయి. ఉత్తరాంధ్రకు మణిహారం లాంటి ఏయూలో ఉత్తరాంధ్రేతరుల ప్రాబల్యం పెరిగిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
దిద్దుబాటు చర్యల్లో భాగంగా బైరాగిరెడ్డి స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన ఆచార్య వి.కృష్ణమోహన్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కీలకమైన వీసీ, రిజిస్ట్రార్ పోస్టులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారన్న విమర్శలకు చెక్ చెబుతూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి సామాజిక సర్దుబాటు చేశారు.
రిజిస్ట్రార్ ఆచార్య బైరాగిరెడ్డి స్థానంలో ఆచార్య కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ నియామకం వీసీ చేతిలో ఉండడంతో కావాల్సిన వ్యక్తిని ఆ హోదాలో నియమిస్తుండడం సహజంగా జరిగేదే.
రిజిస్ట్రార్‌గా ఆచార్య బైరాగిరెడ్డి ఈ నెల 6న బాధ్యతలు స్వీకరించారు. పైగా పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధుల సిఫార్సు ఆధారంగానే వచ్చారు. ఈలోగా ప్రభుత్వం వీసీగా ప్రసాదరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ రెండు హోదాలనూ ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టారన్న విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రార్ మార్పు జరిగిందని చెబుతున్నారు.
ఆచార్య ఎం.ఎస్.ప్రసాదరావు తరువాత ఉత్తరాంధ్రకు చెందినవారు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించిన దాఖలాలు లేవు. ఈసారి స్థానికతకు పెద్దపీట వేస్తూ నగరానికే చెందిన ఆచార్య వి.కృష్ణమోహన్‌కు అవకాశం కల్పించారు.
ఈయన ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా ఆరున్నరేళ్లు పని చేశారు. మరో కీలక పదవి అకడమిక్ అఫైర్స్ డీన్‌గా ఆచార్య వెంకటరావును నియమించారు.
గతంలో ఈ పదవిలో కొనసాగిన ఆచార్య ఎం.వి.ఆర్.రాజు పదవీకాలం వారం కిందటే ముగిసింది. ఆయన స్థానంలో ఎస్.సి. సామాజికవర్గానికి చెందిన వెంకటరావుకు అవకాశం కల్పించారు.
సామాజిక సమతుల్యత పాటించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగానే విశ్వవిద్యాలయంలోని పదవులను భర్తీ చేశామని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు.
త్వరలో మరికొన్ని డీన్, డైరెక్టర్ పోస్టులను కూడా సామాజిక సమతుల్యతను పాటించే భర్తీ చేస్తామన్నారు. ప్రతి పోస్టుకు అర్హులైన ప్రతిభావంతులతో ప్యానెల్‌ను తయారు చేసిన అనంతరం అందరికీ న్యాయం జరిగేలా భర్తీ ఉంటుందన్నారు.