kalabharathi Natakotsavalu starts from 11th april

11 నుంచి కళాభారతి-పైడాకౌషిక్ నాటకోత్సవాలు
ఈ నెల 11 నుంచి 14 వరకు కళాభారతి-పైడాకౌషిక్ నాటకోత్సవాలను పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సీఎస్ఎన్ రాజు తెలిపారు.
సోమవారం కళాభారతి ఆడిటోరియంలో విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాటకోత్సవాల వివరాలను వెల్లడించారు. 14వ వార్షికోత్సవ రాష్ట్రస్థాయి సాంఘిక నాటిక పోటీలను నాలుగురోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు.
రోజుకు రెండు నాటికల చొప్పున ప్రదర్శన ఉంటుందన్నారు. ముగింపురోజున ఉత్తమ ప్రదర్శన నాటకానికి రూ.15వేలు, ద్వితీయ రూ.12వేలు, తృతీయ నాటికకు రూ.10వేల చొప్పున నగదు బహుమతులను సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అందజేయనున్నట్లు వివరించారు.
నాటకోత్సవాలకు రూ.2లక్షల చెక్కును విరాళంగా పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ నిర్వాహకులకు ఇచ్చారు. కార్యక్రమంలో వీటికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. నిర్వాహకులు జీఆర్కే ప్రసాద్, ఆచార్య పి.బాబివర్ధన్, డాక్టర్ కేజీ వేణు తదితరులు పాల్గొన్నారు.