News

Realestate News

కేజీహెచ్‌లో రూ. 20 కోట్లతో స్కిల్‌ల్యాబ్‌

vizag news

ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కింగ్‌జార్జి ఆసుపత్రి/ఆంధ్ర వైద్యకళాశాల ఆవరణలో రూ. 20 కోట్ల ఖర్చుతో అత్యాధునిక వసతులతో కూడిన స్కిల్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం కేజీహెచ్‌/ఏఎంసీ యూనిట్‌ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని శుక్రవారం ఆంధ్ర వైద్యకళాశాల ఎస్‌పీఎం లెక్చర్‌ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు చోట్ల స్కిల్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కేజీహెచ్‌లోనూ ఒకటి పెడుతున్నామన్నారు. దీని ద్వారా రోగాలపై మరింత లోతైన పరిశోధన, విశ్లేషణ జరుగుతాయన్నారు. వైద్యులు పరిశోధనలకు పెద్ద పీట వేయాలని ఆమె సూచించారు. దీనికి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. వైద్య విద్యా సంచాలకులు (డి.ఎం.ఇ) డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్లకు త్వరలోనే ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తామన్నారు. వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని, వేతన స్థిరీకరణ కూడా జరుగుతుందన్నారు. ఏపీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్‌ జి.అర్జున మాట్లాడుతూ వైద్యులకు నిర్ణీత కాలవ్యవధిలో పదోన్నతులు కల్పించాలని, వసతులను మెరుగుపర్చాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి డాక్టర్‌ జయధీర్‌బాబు, కేజీహెచ్‌ ఉప పర్యవేక్షక వైద్యాధికారులు డాక్టర్‌ బి.ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ కె.సత్యవరప్రసాద్‌, విమ్స్‌ ఓఎస్‌డీ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైద్యులకు సత్కారం

వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రస్తుత డీఎంఈ డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు, విశ్రాంత డీఎంఈలు డాక్టర్‌ ఆర్‌.శశిప్రభ, డాక్టర్‌ జి.సాయిగోపాల్‌, డాక్టర్‌ కె.విష్ణుప్రసాద్‌, డాక్టర్‌ జి.శాంతారావు, డాక్టర్‌ జి.భాగ్యారావు, కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ ఎం.మధుసూదనబాబు, ఆంధ్ర వైద్యకళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.కామేశ్వరిలను సంఘం తరఫున సత్కరించారు. వీరికి పూనం మాలకొండయ్య జ్ఞాపికలు అందించారు. అదే విధంగా ఉత్తమ సేవలందించిన కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సాగర్‌బాబు, ఎనస్తీషియా విభాగ సహాయ ప్రొఫెసరు డాక్టర్‌ సతీష్‌, పదవీ విరమణ చేసిన కార్డియాలజిస్టు డాక్టర్‌ జి.వెంకటేశ్వరరెడ్డి, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఆర్‌.పార్వతిలను సత్కరించారు. ఎ.పి.జి.డి.ఎ. తరఫున పూనం మాలకొండయ్యను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.