News

Realestate News

సెప్టెంబరులో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

IRCTC special package in September.

సెప్టెంబరులో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

 

అరకు అందాల వీక్షణకు రైలు ప్రయాణం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ రోడ్‌ కం రైలు ప్యాకేజీలో పర్యాటకుల్ని అరకు తీసుకెళ్లేది. గత రెండేళ్లుగా తగిన అనుమతులు లేక దీన్ని నిర్వహించలేకపోయింది. తాజాగా అవకాశం దొరకడంతో మళ్లీ ప్యాకేజీ పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తోంది.

రెండేళ్ల కిందటి వరకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అరకుకు రైలు కం రోడ్డు ప్యాకేజీ నిర్వహించేది. విశాఖ నుంచి అరకు వరకు రైలులో ప్రయాణించి తిరిగి బస్సులో నగరానికి చేరుకునేలా దీన్ని రూపొందించారు. అధికారిక అనుమతులు లేకపోవడంతో 2017 చివరి వరకు బాగానే సాగినప్పటికీ ఆ తరువాత రైల్వే శాఖ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఈ ప్యాకేజీని నిలిపేశారు.
ఏటా రూ.2 కోట్ల పైనే..: అరకుకు రైలు కం రోడ్డు ప్యాకేజీతో ఏపీటీడీసీకి ఏటా రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అది ఆగిపోవడంతో సంస్థకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగింది.
ఎక్కడి నుంచి ఎక్కడకు : కిరండూల్‌ పాసింజర్‌ ఉదయం 6:50 గంటలకు విశాఖ స్టేషన్‌లో బయల్దేరుతుంది. అరకుకు ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులు దిగి పర్యాటక శాఖకు చెందిన బస్సులో స్థానిక ప్రాంతాల్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి అనంతగిరి చేరుకుంటారు. బొర్రా గుహల సందర్శన అనంతరం టైడా వద్ద కొంత సమయం విశ్రాంతి తీసుకొని రాత్రి 8 గంటల కల్లా విశాఖకు చేరుకుంటారు.
ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌షిప్‌ ద్వారా అవకాశం: రెండేళ్ల కిందట ప్యాకేజీ నిలిచిపోవడంతో దాన్ని కొనసాగించడం, ఒక బోగీని ప్రత్యేకంగా కేటాయించాలని పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులకు విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ను సైతం కలిశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అనుమతులు రాలేదు. * ఐఆర్‌సీటీసీ అధికారులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమయంలో సంబంధిత అధికారులు ఇచ్చిన సలహా ప్యాకేజీ పునరుద్ధరణకు వీలు కలిగించింది. టిక్కెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌షిప్‌ తీసుకోవడం ద్వారా నచ్చినన్ని టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం వస్తుందని చెప్పడంతో దీన్ని పునరుద్ధరిస్తున్నారు.

* ప్రస్తుతం విశాఖ నుంచి వెళ్లే రైలులో 200 వరకు రిజర్వేషన్‌ సీట్లు ఉన్నాయి. ఖాళీలు, డిమాండు ఆధారంగా ఎన్ని సీట్లయినా బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఏజెంట్‌షిప్‌ కోసం ఏపీటీడీసీ అధికారులు అవసరమైన అనుమతులు ఇప్పటికే తీసుకున్నారు. నిర్ణీత రుసుం చెల్లించారు.

* ప్రయోగాత్మకంగా టిక్కెట్ల బుకింగ్‌ పరిశీలన చేపట్టారు. పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ ద్వారా రైలు కం రోడ్డు ప్యాకేజీ బుక్‌ చేసుకున్న వారికి రైల్వే టిక్కెట్లను నిర్వాహక అధికారులే బుక్‌ చేసి ప్యాకేజీను కొనసాగిస్తారు. సీజన్‌లో మాత్రం కొంత అసౌకర్యం కలిగే అవకాశం కనిపిస్తుంది.

* ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వారం రోజుల్లో వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ప్రస్తుతానికి రోడ్డు ప్యాకేజీ తీసుకున్న వారినే ఫోన్లో సంప్రదించి రైలు ప్యాకేజీ గురించి అడిగి కావాలనుకున్న వారికి టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారు. * టిక్కెట్ల బుకింగ్‌ ప్రక్రియ కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది.

17 సీట్లతో ప్రత్యేక ప్యాకేజీ : సెప్టెంబరులో విశాఖ నుంచి అరకు పర్యటనకు రైల్వేశాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ ఒక ప్యాకేజీ తీసుకువస్తోంది. రైలులో 17 సీట్లు ఐఆర్‌సీటీసీకి రైల్వే శాఖ కేటాయించగా ఇందులో నాలుగు సీట్లు విస్టాడోమ్‌ కోచ్‌లో, మూడు స్లీపర్, మిగిలిన పది సీట్లు రిజర్వేషన్‌వి ఉంటాయి. సీట్ల వరకు సంస్థ చూసుకోగా ప్యాకేజీ నిర్వహణ బాధ్యతను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థే చూసుకోనుంది. ప్రాథమికంగా ఈ ప్యాకేజీ ధరను ఇంకా నిర్ణయించలేదు. ఐఆర్‌సీటీసీ అదనంగా టిక్కెట్‌ ఛార్జీలు సేవా రుసుం వేసుకొని ప్యాకేజీ ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లో ఉన్నతాధికారులతో అవగాహన ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే ప్యాకేజీకి, దీనికి ఎటువంటి సంబంధం ఉండదు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo