News

Realestate News

నూతన ఆవిస్కరణలకు ఇన్‌స్పైర్‌

Inspire for new innovations.he central government has introduced a scheme titled 'Inspire Awards-Manak' to make the country an innovation hub.

నూతన ఆవిస్కరణలకు ఇన్‌స్పైర్‌

 

దేశాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌-మనక్‌’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకం ద్వారా దేశంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న ‘ఇన్‌స్పైర్‌’ కార్యక్రమాన్ని పునరుద్ధరించి అమలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా 5లక్షల పాఠశాలల్లో వినూత్న అన్వేషణల వైపు విద్యార్థులు దృష్టి సారించేందుకు ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 10లక్షల ఆవిష్కరణలు చేయించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

ఇందులో నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రతి ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున అందజేస్తారు. 2019-20 విద్యాసంవత్సరంలో భాగస్వాములు కావడానికి 10 నుంచి 15ఏళ్ల వయసు గల 6 నుంచి 10వతరగతి చదువుతున్న విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు.

ఇలా దరఖాస్తు చేయాలి…

ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌లో భాగస్వాములు కావడానికి ఈ నెల 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు తమ నామినేషన్లు దాఖలు చేయొచ్ఛు inspireawards–dst.gov.in school login వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కాని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓఆర్‌టీ) పూర్తి చేసుకుని ఆన్‌లైన్‌లో జిల్లా అథారిటీకి ఫార్వర్డ్‌ చేయాలి.

విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల చిరునామా, ఈ మెయిల్‌, ఫోన్‌నెంబర్‌, ప్రధానోపాధ్యాయుడి పేరుతో పాటు ఇతర వివరాలు నమోదు చేయాలి.

ఓఆర్‌టీ చేసిన 24 నుంచి 48 గంటల్లోపు ఈ-మెయిల్‌ ఐడీకి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పాఠశాలలకు సంబంధించి ఈ మెయిల్‌ అడ్రస్‌ మర్చిపోతే తిరిగి కొత్తవన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

వన్‌టైం రిజిస్ట్రేషన్‌ విండోలో మీ పాఠశాల పేరు లేకపోతే అదర్స్‌లో చేర్చి పూర్తి చేసుకోవాలి.

ఓఆర్‌టీ దశలో పొందిన యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి విద్యార్థుల నామినేషన్‌ పూర్తిచేయాలి. ఈ సమయంలో ప్రాజెక్టు రైట్‌ అప్‌ వర్డ్‌ (పీడీఎఫ్‌) ఫార్మాట్‌లో, విద్యార్థి ఫొటో, ఆధార్‌సంఖ్య, విద్యార్థి బ్యాంక్‌ ఖాతా వివరాలు పొందుపర్చాలి.

2018-19 విద్యాసంవత్సరంలో..

2018-19 విద్యాసంవత్సరంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 605 పాఠశాలలు నామినేషన్లు దాఖలు చేసుకున్నాయి. అందులో 2006 ప్రాజెక్టులు పంపించగా 436 ప్రాజెక్టులు ఎంపికయి ప్రతి ప్రాజెక్టుకు రూ.10వేలు చొప్పున రూ.43.60లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటిలో రాష్ట్రస్థాయిలో 35 ప్రాజెక్టులు ప్రతిభ చాటగా, 7 ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయి బాలల మేధస్సును చాటిచెప్పాయి.

ఇన్‌స్పైర్‌ మనక్‌లో ప్రతిభ చాటాం..

పూర్వ విద్యార్థిని ఎన్‌.సువర్ణ బహుళ వ్యవసాయ యంత్రం నమూనా రూపొందించి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందడంతో మేము కూడా అలాగే రాణించాలని నిర్ణయించుకున్నాం.

గతంలో హోమ్‌ ఆటోమిషన్‌, రైల్వే ట్రాక్‌క్లీనింగ్‌ అండ్‌ ట్రాక్‌ డిటెక్షన్‌ రోబో నమూనాలను పొందుపరిచాం. జిల్లాస్థాయిలో జరిగిన ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ప్రథమస్థానంలో నిలిచాం.

ఈ ఏడాది కూడా మా పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. -గొర్లె మునిక, జి.మౌనిక, ఎం.జిజ్ఞాస, 9, 10తరగతి విద్యార్థులు, ఏపీబాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల, మధురవాడ

పఠనాసక్తికాదు.. పరిశోధనాసక్తి కావాలి..

మారుతున్న ప్రపంచ పరిణామాలతో పఠనాసక్తి స్థానంలో పరిశోధనాసక్తికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ దిశగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కోణంలో భాగమే ఇన్‌స్పైర్‌ మనక్‌అవార్డ్స్‌-2019-20. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ తరగతులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం.  -కె.ప్రసాద్‌, జిల్లా సైన్సు అధికారి, విశాఖపట్నం

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo