Increased demand for admissions at Inter

ఇంటర్లో ప్రవేశాలకు పెరిగిన డిమాండ్
కృష్ణా కళాశాల రెండో స్థానంలో
డాక్టర్ వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల
జిల్లా వ్యాప్తంగా మొన్నటి వరకు 36 కళాశాలలుండగా, ఈ ఏడాది ఆనందపురం, మల్కాపురం, లాలాంకోడూరులో కొత్తగా మూడు కళాశాలలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ సంఖ్య 39కి చేరింది.
దీంతో పాటు 8 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటికి జూన్ 30వ తేదీ వరకు మొదటి విడత ప్రవేశాలు నిర్వహించారు.
పెరిగిన ప్రవేశాలు..
గత ఏడాది 36 ప్రభుత్వ కళాశాలలు, ఎనిమిది ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 9,250 మంది ప్రవేశాలు పొందగా, ఈ ఏడాది 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎనిమిది ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 10,390 మంది విద్యార్థులు కొత్తగా చేరారు.
గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1140 మంది విద్యార్థులు పెరిగారు.
ప్రభుత్వ పాఠశాలలే కాదు.. కళాశాలలు కూడా ప్రవేశాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ విద్యలో ఈ మార్పు కనిపిస్తోంది. మొదటి విడత ప్రవేశాల్లోనే ఆశించినదానికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరగా.. మలి విడతలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కళాశాలల్లో మౌలిక సదుపాయలు, ప్రభుత్వ కొత్త పథకాలు వీటిపై ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు.
10,390 ఈ ఏడాది ప్రవేశాలు
ప్రవేశాల్లో యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ 612 మంది విద్యార్థులు చేరారు. మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల 547 మంది ప్రవేశాలతో రెండోస్థానంలో నిలిచింది. 518 మంది విద్యార్థులతో నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మూడోస్థానంలో నిలిచింది.
15 వేలు అంచనా…
మొదటి విడత ప్రవేశాలు జూన్ 30వ తేదీతో ముగిశాయి. రెండో విడత ఈనెల 8వ తేదీన మొదలయ్యాయి. ఈనెల 31తో ముగియనున్నాయి. అవి ముగిసేటప్పటికి మొత్తం 15 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు కూడా రావాల్సి ఉన్నందున ఆ విద్యార్థులు కూడా చేరతారన్నారు.
‘కొత్త’కు ఆదరణ..
ఈ ఏడాది జిల్లాలో కొత్తగా మూడు కళాశాలలు ఏర్పాటు చేయగా మల్కాపురం జూనియర్ కళాశాలలో 53 మంది, ఆనందపురం కళాశాలలో 22 మంది చేరారు. రెండో విడత ప్రవేశాల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
ప్రథమస్థానంలో ఒకేషనల్…
ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా కొనసాగుతున్న మద్దిలపాలెం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో 318 మంది ప్రవేశాలు పొందారు. ఈ కళాశాల జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. 224 ప్రవేశాలతో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల రెండోస్థానంలో నిలిచింది.
● ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అమ్మఒడి పథకంలో ఇంటర్ విద్యను కూడా చేర్చారు. ఇది కూడా ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా ఇటువైపు మొగ్గుచూపేలా చేసింది.
● దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రయోగ పరీక్షలు కూడా బాగానే జరుగుతున్నాయి. అధ్యాపకులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. ఇది కూడా కొంత సత్ఫలితాలను ఇస్తోంది.
● ఇంటర్ విద్యలో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. ఈ ప్రభావం ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ పథకం కొనసాగబోదని ప్రకటించటం విద్యార్థులకు ఆందోళనకు గురిచేసింది. లేకపోతే ఇంకా ప్రవేశాలు బాగుండేవనుకుంటున్నారు.
● ప్రైవేటు విద్యార్థులకు పుస్తకాల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విద్యార్థి సుమారు రూ. 1500-2000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా అందిస్తున్నారు. పైగా సమయానికి పంపిణీ జరుగుతోంది.
సౌకర్యాలన్నీ ఇస్తున్నాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాం. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం. ఆగస్టు మొదటి వారం నుంచే సైన్సు గ్రూపు విద్యార్థులకు ప్రయోగాలు చేయిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రవేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. మలి విడతలో ఇంకా పెరగవచ్చని భావిస్తున్నాం.