News

Realestate News

సీజనల్‌ వ్యాధుల అదుపునకు కార్యాచరణ


సీజనల్‌ వ్యాధుల అదుపునకు కార్యాచరణ

 

ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న పూనం మాలకొండయ్య

 రాష్ట్రంలో సీజన్‌ వ్యాధులను అదుపు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసి అమలు చేస్తున్నామని, జ్వరాలు, ఇతర వ్యాధుల ప్రబలడానికి కారకాలైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు.

విశాఖ వచ్చిన ఆమె గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో అయిదు జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.

రానున్న సీజన్‌లో ప్రబలే వ్యాధులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ శాఖల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం పూనం మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు.

వచ్చే నెల 30 వరకు ప్రత్యేక డ్రైవ్‌

సీజన్‌వ్యాధులను అదుపు చేసే ప్రక్రియలో భాగంగా ఈనెల 15 నుంచి ప్రత్యే డ్రైవ్‌ ప్రారంభించామని, వచ్చే నెల 30 వరకూ ఇది కొనసాగుతుందని చెప్పారు.

రెండోదశ ప్రత్యేక డ్రైవ్‌ జూన్‌లో ప్రారంభిస్తామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చడం, సురక్షిత తాగునీరు సరఫరా, జ్వరాలు వచ్చే నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.

గత ఏడాదితో పోల్చితే ఈ సారి 60 శాతం మేర మలేరియా, డెంగీ వంటి జ్వరాలు తక్కువగా నమోదయ్యాయన్నారు.

 

ఎండలతో జాగ్రత్త

ఎండలు తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో వడదెబ్బ, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైందని వివరించారు.

జీవీఎంసీ పరిధిలో దోమలు ప్రబలకుండా చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. పీహెచ్‌సీల్లో తల్లి, బిడ్డ, సురక్ష పథకాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు.

నగరంలోని ఈఎన్టీ ఆసుపత్రిలో వసతులను మెరుగుపర్చుతామని, సీటీస్కాన్‌ సదుపాయం కల్పించే విషయమై పరిశీలన చేస్తామని తెలిపారు.

సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య శాఖల అధికారులతో పాటు పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణకుమారి, కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.