నేడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి రాక

పెదవాల్తేరు, న్యూస్టుడే: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం నగరానికి వస్తున్నారని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. మంగళవారం దసపల్లాహిల్స్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఉదయం 9 గంటలకు విమానాశ్రయానికి చేరుకునే వెంకయ్యనాయుడికి భారీగా స్వాగతం పలకడానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలన్నారు. విమానాశ్రనయం నుంచి అప్పూఘర్లోని ఎంపీ కార్యాలయం వరకు కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రకటించిన సాయంపై రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలపై వెంకయ్య వివరిస్తారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పార్టీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర మాట్లాడుతూ… ప్రతి వార్డు నుంచి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ప్రతినిధి చెరువు రామకోటయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.