News

Realestate News

పాడేరు ఎమ్మెల్యే విజేత భాగ్యలక్ష్మి సాహసం

Grace MLA Bhagyalakshmi's adventure

 పాడేరు ఎమ్మెల్యే విజేత భాగ్యలక్ష్మి సాహసం

 


ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న భాగ్యలక్ష్మి

పాడేరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయకముందే గిరి గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఒడిశా సరిహద్దుతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పేరొందిన చెరువూరు గ్రామంలో భద్రతా లేకుండా సోమవారం పర్యటించారు.

మండల స్థాయి అధికారులూ ఈ ప్రాంతంలో పర్యటించేందుకు భయపడుతుంటారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవరూ బలపం పంచాయతీలో పర్యటించలేదు.

గతంలో జరిగిన బాక్సైట్‌ ఉద్యమంలో అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరుకొండలో నిర్వహించిన బాక్సైట్‌ వ్యతిరేక బహిరంగ సభకు హాజరయ్యారు.

అప్పటి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరుకొండ వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. అప్పుడప్పుడు పోలీసులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు మినహా చెరువూరు ప్రాంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లిన సందర్భాలు లేవు.

గతంలో పాడేరు ఆర్డీవోగా పనిచేసిన ప్రసాద్‌ ఓసారి అటవీ హక్కుల చట్టం కింద పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోరుకొండ రాగా, మావోయిస్టులు అడ్డగించి కొద్ది గంటలపాటు నిర్బంధించి తర్వాత వదిలేశారు. ఆ భయంతో బలపం పంచాయతీలో పర్యటించేందుకు అధికారులెవరు ఎవరూ సాహసించరు.

బలపం పంచాయతీని దత్తత తీసుకున్న విశాఖ పూర్వ ఎస్పీ కోయ ప్రవీణ్‌ రెండుసార్లు బలపంలో పర్యటించారు. ఎస్పీలుగా పనిచేసిన ఘట్టమనేని శ్రీనివాస్‌, రాహుల్‌దేవ్‌శర్మ కోరుకొండ, బలపంలో పర్యటించినా పూర్తిభద్రత నడుమ వీరి పర్యటన సాగింది.

తాజాగా భద్రతా ఏర్పాట్లు, రక్షణ చర్యలు లేకుండా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి బలపం, కోరుకొండ దాటి ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న చెరువూరు గ్రామానికి చేరుకున్నారు. కోరుకొండ వరకు రహదారి కాస్త బాగానే ఉన్నా అక్కడ నుంచి చెరువూరు వరకు రహదారి దుర్భరంగా ఉంది.

మార్గమధ్యలో అనేక వాగులు ఉన్నాయి. ఎత్తుపల్లాలతో నిండి ఉన్న రహదారిలో వాహనంలో ఆమె చెరువూరు వచ్చారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆమెను అనుసరించారు.