
రెవెన్యూలో బదిలీల కసరత్తు
నేడు వీఆర్వోలకు బదిలీ కౌన్సెలింగ్
జేసీ-2 ఎం.వెంకటేశ్వరరావుకు జాయినింగ్ రిపోర్టులు అందజేస్తున్న తహసిల్దార్లు
రెవెన్యూ శాఖలో బదిలీల కసరత్తు మొదలైంది. జేసీ శివశంకర్ ఆధ్వర్యంలో జేసీ-2, డీఆర్వో, ఇతర అధికారులు మంగళవారం బదిలీలకు అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేశారు.
బదిలీల కోసం 660 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, వారిలో వీఆర్వోలే 350 మందికి పైగా ఉన్నారు. మిగిలిన వారు తహసిల్దార్లు, డీటీలు, సీనియర్, జూనియర్ సహాయకులు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి దాదాపు 49 మంది తహసిల్దార్లు జిల్లాకు వచ్చారు.
అయితే జిల్లాలో 46 మండలాలు, మరో 22 స్పెషల్ తహసిల్దార్ పోస్టులు ఉన్నాయి. కీలక మండలాల్లో తమ వారిని నియమించాలని జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే కలెక్టర్కు సిఫార్సు లేఖలు ఇచ్చారు.
బదిలీల ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుండడంతో ఉన్నతాధికారులు ప్రభుత్వ నిబంధనలు, ప్రజా ప్రతినిధుల సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని జాబితా సిద్ధం చేస్తున్నారు.
బుధవారం తహసిల్దార్ల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన తహసిల్దార్లు మంగళవారం కలెక్టరేట్లో జేసీ-2 వెంకటేశ్వరరావును కలిసి జాయినింగ్ రిపోర్టులు అందజేశారు.
వీఆర్వోలు బుధవారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్కు హాజరవాలని కలెక్టరేట్ అధికారులు సమాచారం పంపారు. తాజా బదిలీల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో వీఆర్వో నుంచి తహసిల్దార్ వరకు పూర్తిస్థాయిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.