అందరూ చదవాలి.. ఎదగాలి..

అందరూ చదవాలి.. ఎదగాలి..
శివగణేష్ నగర్లో మత్స్యకార పిల్లలకు పాఠాలు చెబుతున్న సభ్యురాలు
చదువుతో మనిషికి సంస్కారం అలవడుతుంది… వికాసం కలుగుతుంది.. తను అభివృద్ధి చెందడమే కాకుండా.. దేశాభివృద్ధికి ఉపయోగపడతాడు. ఇవన్నీ చదువుతోనే సాధ్యం.
ఎంతో అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా చాలామంది మురికివాడల పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు. గాడితప్పి జీవితాలను పాడుచేసుకుంటున్నారు.
ఇలాంటి పిల్లలను చదువువైపు మళ్లించేందుకు.. వారికి మంచి భవిష్యత్తు చూపించేందుకు ‘ఏకలవ్య ఫౌండేషన్’ బాధ్యత తీసుకుంది. మురికివాడలే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తోంది.
: ఏకలవ్య ఫౌండేషన్ ఇప్పటికే ‘అక్షయ విద్య’ పేరుతో హైదరాబాద్, తిరుపతి, కడప నగరాల్లో మురికివాడల్లోని పిల్లలకు విద్య, విలువలు, క్రమశిక్షణ నేర్పింది.
ఆయా కార్యక్రమాలు విజయవంతమయ్యాక విశాఖనగరంలోనూ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
సంస్థలో సభ్యులు ఎవరంటే..
వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగులు, చదువుకున్న యువకులు సభ్యులుగా ఉంటారు. వీరు సాయంత్రం వేళ మురికివాడల్లోని పిల్లలకు చదువు, మానవీయ విలువలు, క్రమశిక్షణ తదితర అంశాలు నేర్పిస్తారు.
వీరి సేవలను సంస్థ ఉచితంగా తీసుకోదు. ఏకలవ్య ఫౌండేషన్ వీరికి రూ. 1500 గౌరవ వేతనం చెల్లిస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం సీఎస్ఆర్ నిధులు ఫౌండేషన్‌కు అందిస్తోంది.
ప్రయోజకులను చేయాలనే..
మురికివాడల్లోని పిల్లల్లో చాలామంది పాఠశాలలకు దూరమవుతున్నారు. కొందరు చదువుతున్నా సమయాన్ని వృథా చేస్తున్నారు. వీరి దృష్టిని అభివృద్ధి వైపు ఉంచటం వల్ల మంచి ప్రయోజకులు కాగలుగుతారు.
ప్రస్తుతం ఏకలవ్య ఫౌండేషన్ వారికి విద్యాబుద్ధులు నేర్పించటంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పిస్తోంది.