News

Realestate News

వైఎస్సార్‌ పార్క్‌గా సిటీ సెంట్రల్‌ పార్క్‌


వైఎస్సార్‌ పార్క్‌గా సిటీ సెంట్రల్‌ పార్క్‌

నగరం నడిబొడ్డున ఉన్న సిటీ సెంట్రల్‌ పార్క్‌ పేరు సోమవారం నుంచి డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్‌ పార్క్‌గా మారనుంది. సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా పేరు మార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఈ ఉద్యానవనానికి ఆయన పేరు పెట్టాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకు అన్ని రకాల అనుమతులు తీసుకొని పేరు మార్పునకు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ తరువాత పలు రాజకీయ, ఇతర కారణాల వల్ల జరగలేదు.

ఇటీవల వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేరు మార్పునకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు.

కొద్ది రోజుల కిందట జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సిటీ సెంట్రల్‌ పార్క్‌ పేరును వైఎస్సార్‌ పార్క్‌గా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించడంతో వీఎంఆర్‌డీఏ ఆ దిశగా ఉపక్రమించింది.

ఇందులో భాగంగా అధికారులు వారం రోజుల కిందట దీనికి సంబంధించిన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపగా అనుమతులు వచ్చాయి. దీంతో జులై 8న వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పేరు మార్చేందుకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఒక్కో అక్షరం రెండు అడుగులు

సెంట్రల్‌ పార్క్‌ లోపలికి వెళ్లే ముందు ఎగురుతున్న డాల్ఫిన్‌ స్వాగతం తెలిపేలా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న నేమ్‌ బోర్డును వీఎంఆర్‌డీఏ సిటీ సెంట్రల్‌ పార్క్‌ పేరు బదులు డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌ పార్క్‌గా మార్చుతున్నారు.

ఇందులో ఒక్కో అక్షరం రెండు అడుగుల పొడవు, వెడల్పుతో ఉండడంతో మొత్తం అన్నీ కలిపి 30 అడుగుల పొడవులో ఏర్పాటు చేస్తున్నారు. పేరు పెద్దదిగా ఉండడంతో రెండు వరుసల్లో ఉండేలా అమర్చుతున్నారు.

వైఎస్సార్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు

పార్క్‌ పేరును మార్చడంతో పాటు ఎత్తైన వైఎస్సార్‌ కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పన్నెండున్నర అడుగుల ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేయగా దానికి కొత్త రంగులు వేయాల్సి ఉంది.

భారీ విగ్రహాన్ని నిలబెట్టేందుకు పార్క్‌లోని చిన్న వాటర్‌ ఫౌంటేన్‌ వెనుక అంతే ఎత్తున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విగ్రహం కింద అయిదు అడుగుల ఎత్తున ఆధునిక హంగులతో వేదిక నిర్మిస్తారు.

విగ్రహంతో పాటు వేదిక ఎత్తుతో కలిపి మొత్తం పదిహేడున్నర అడుగుల ఎత్తున కనిపించేలా నిర్మించనున్నారు. విగ్రహం వెనుక వైఎస్సార్‌ స్మృతులతో కూడిన గోడ ఏర్పాటు చేస్తారు. సోమవారం విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo