News

Realestate News

జిల్లా కేంద్రంలోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటు

Gopalakrishna Dwivedi, Chief Secretary, State Panchayat and Rural Development Departments,


జిల్లా కేంద్రంలోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటు

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ
కమిషనర్‌ సృజన, జేసీ శివశంకర్‌

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు.

మంగళవారం సాయంత్రం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాలు సాధ్యమైనంత వరకు జిల్లా కేంద్రాల్లో ఉండే విధంగా చూడాలన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల భవనాలను ఉపయోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాల తరలింపునకు వీలుగా మ్యాపులను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, జడ్పీ సీఈఓ, డీపీఓ, డీఈఓలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి 2లక్షల మంది వరకు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో జేసీ శివశంకర్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, జడ్పీ సీఈఓ రమణమూర్తి, డీపీఓ కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

● పరిహారం విడుదల చేయాలి: అనకాపల్లి మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఏపీఐఐసీ అవసరాల కోసం సేకరించిన భూమికి సంబంధించి కొంత మందికి ఇంకా పరిహారం అందలేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు.

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ఆయన పరిహార చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు.

సచివాలయ కార్యదర్శుల పరీక్షకు చురుగ్గా సన్నాహాలు

పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌

సచివాలయ కార్యదర్శుల రాత పరీక్షకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నామని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం సబ్బవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ కార్యదర్శుల పరీక్షకు నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కార్యదర్శులు, ఇతర పోస్టులకు 20లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

పరీక్షా కేంద్రాలు సరిపోని పక్షంలో మండల ప్రధాన కేంద్రాల్లో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్ష 150మార్కులకు ఉంటుందన్నారు. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయన్నారు.

అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లు నింపాల్సి ఉంటుందన్నారు. మైనస్‌ మార్కులు కూడా ఉంటాయన్నారు. జిల్లా సెలక్షన్‌ బోర్డు (డీఎస్సీ) ఈ పరీక్షను నిర్వహిస్తుందన్నారు.

ఎంపికైన వారికి రెండు సంవత్సరాల వరకు రూ. 15000 ఇస్తారని, రెగ్యులరైజ్‌ అయితే ఉద్యోగాలను బట్టి రూ. 16వేల నుంచి రూ.40వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. అదనంగా టీఏ, డీఏలు ఉంటాయని పేర్కొన్నారు.