బాలల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలు రావాలి
బాలల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలు రావాలి
బాలబాట సంచికను విడుదల చేస్తున్న ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య
కృష్ణమోహన్, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, మంచిపల్లి శ్రీరాములు, కె.ఎస్వీ రమణమ్మ తదితరులు
బాలల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలు రావాలని, తాను చిన్నతనంలో చదివిన చందమామ, బాలమిత్ర, పంచతంత్ర కథలు నేడు తన నడత, వృత్తికి ఎంతో దోహదం చేశాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ తెలిపారు.
సోమవారం ఉదయం విశాఖ పౌరగ్రంథాలయంలో బాలబాట మాస పత్రిక 11వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాసపత్రిక సంపాదకులు కె.ఎస్వీ రమణమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పంచతంత్ర కథల్లోని నీతిని పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు చెబుతుంటే విద్యార్థులు శ్రద్ధగా ఆలకించేవారన్నారు.
మిత్రలాభం, మిత్రభేదం వంటి కథలు చదవడం వల్ల పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలుస్తుందన్నారు. తెలుగు ప్రాంతీయ భాష కాదని, నేడు ప్రపంచ దేశాల వారు తెలుగు నేర్చుకొనేందుకు ఉత్సుకత చూపుతున్నారని ఆయన చెప్పారు.
మళ్లీ తెలుగుకు పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు నారంశెట్టి ఉమామహేశ్వరరావు, బెలగాం భీమేశ్వరరావు, రచయిత్రి కళ్లేపల్లి స్వర్ణలతలను సత్కరించారు.
బాలబాట 11వ వార్షిక పత్రికతో పాటు మరో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి(విజయవాడ) డాక్టర్ జి.వి.పూర్ణచంద్, సాహితీ లహరి అధ్యక్షులు (పార్వతీపురం) మంచిపల్లి శ్రీరాములు పాల్గొని ప్రసంగించారు.