ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం

ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం

అనకాపల్లి క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు.
పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ మైదానాన్ని సోమవారం సాయంత్రం ఆయన పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అనకాపల్లిలో వివిధ క్రీడల్లో రాణించి గుర్తింపు పొందిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు.
క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్నవారికి తర్ఫీదు అందించి ప్రోత్సహిస్తామన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనకాపల్లిలో క్రీడాకారుల సౌకర్యార్థం రాజీవ్‌గాంధీ ఇండోర్ మైదానాన్ని నిర్మించారని గుర్తుచేశారు.
అనంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో ఇండోర్ మైదానం నిరాదరణకు గురైందని పేర్కొన్నారు. మైదానంలో ఆధునిక హంగులు కల్పించి పునః ప్రారంభించామని పేర్కొన్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేయడానికి కావాల్సిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ. 40 లక్షలతో మైదానం వెలుపల ప్రహరీ, పెయింటింగ్, లైటింగ్ సదుపాయాన్ని కల్పించేలా త్వరలోనే పనులు చేపడతామని పేర్కొన్నారు.
అనంతరం ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాడి జయవీర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈనెల 9,10 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర బాల్ బ్యాడ్మింటన్ పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు.
కార్యక్రమంలో వైకాపా నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకీరామరాజు, డాక్టర్ విష్ణుమూర్తి, దాడి జయవీర్, కొణతాల మురళీకృష్ణ మళ్ల బుల్లిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.