ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి పండగ

ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి పండగ
రెండేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు కదలిక వచ్చింది. అడహక్ ప్రమోషన్ల పేరిట అర్హుల వివరాలను సీనియార్టీ జాబితా రూపంలో జిల్లా విద్యాశాఖకు చెందిన deovsp.net వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచారు.
దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో ఆధారాలతో సంబంధిత ప్రధానోపాధ్యాయుడి ద్వారా డీఈవో కార్యాలయానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
వీటిపై ఈ నెల 28, 29 తేదీల్లో విచారించి తుది జాబితాను రూపొందిస్తారు. జులై 1న తుది జాబితా, ఖాళీల వివరాలను విడుదల చేస్తారు. జులై 3న ప్రధానోపాధ్యాయులు, 4, 5 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల (స్కూల్ అసిస్టెంట్లు) కొరత ఉంది. గత రెండేళ్లుగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ టీచర్లకు సర్దుబాటు పేరుతో సమీప ఉన్నత పాఠశాలల్లో బోధన బాధ్యతలను అప్పగిస్తున్నారు.
గత విద్యా సంవత్సరంలో 105 మంది స్కూల్ అసిస్టెంట్లను ఇలా సర్దుబాటు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 34 మందిని ఇతర పాఠశాలలకు పంపించారు.
సబ్జెక్ట్ టీచర్ల కొరత పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపుతున్నందునే ఇలా చేయాల్సి వస్తోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో 32 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులే లేరు. స్కూల్ అసిస్టెంట్లకే ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించాల్సి వస్తోంది.
వచ్చే నెలలో 2018 డీఎస్సీ ద్వారా వస్తున్న కొత్త ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది ఎస్జీటీలే ఉన్నారు.. దీంతో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు పచ్చజెండా ఊపడం.. షెడ్యూల్ కూడా విడుదల చేయడంతో స్కూల్ అసిస్టెంట్ల కొరత చాలా వరకు తీరనుంది.
230 మందికి అవకాశం..
జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 230 వరకు ఖాళీలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఉద్యోగోన్నతులతో భర్తీ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియార్టీ జాబితాను సిద్ధం చేసింది. 2017లో ఉద్యోగోన్నతులు నిలిచిపోయినప్పటి రిజర్వేషన్ల (రూల్ ఆఫ్ రిజర్వేషన్లు) రోస్టర్‌తో మొదలుకానున్నాయి.
ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు విశాఖ నగర పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశావహులంతా నగరంలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను అనుసరించి చేపడుతున్న ఈ ఉద్యోగోన్నతులను స్వాగతిస్తున్నట్లు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు తెలిపారు.
దీనివల్ల జిల్లాలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరుతుందని, ప్రధానోపాధ్యాయుల ఖాళీలు భర్తీ అవుతాయని డీఈవో లింగేశ్వరరెడ్డి చెప్పారు. అప్పటికీ హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉంటుందని వీరిని సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు.
ఒకేచోట అయిదేళ్లుంటే… స్థాన చలనమే
బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా బదిలీలపై చర్చ నడుస్తోంది. విద్యా సంవత్సరం మొదలుకావటంతో ఉంటాయా? ఉండవా? అన్న అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎలా నిర్వహించాలన్నదానిపై అంటే.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా?
కౌన్సెలింగ్ విధానం అనుసరిస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. మార్గదర్శకాలను మాత్రం ప్రస్తావించింది. విద్యా సంవత్సరం మొదలైనందున విద్యాశాఖను మినహాయించింది.
ఐదేళ్ల నుంచి ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఎప్పుడూ గిరిజన ప్రాంతాల్లో పనిచేయని వారిని మాత్రమే ఆయా ప్రాంతాలకు బదిలీ చేస్తారు.
*● జిల్లాలో దాదాపు 40 వేలమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. విద్యాశాఖను మినహాయిస్తే మిగిలిన 25 వేల నుంచి 28 వేల మందిలో కనీసం 2 వేల నుంచి 2500 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ మంగళవారం నుంచే మొదలుకానుంది. ● స్టేషన్ సీనియార్టీ (నగరం/పట్టణం/గ్రామీణం) ప్రాతిపదికన ఐదేళ్లను లెక్కిస్తారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా బదిలీ చేయాలి.
*● అనారోగ్య కారణాలను చూపించినవారిని కనికరించే అవకాశం ఉంది. ఉద్యోగి లేదా అతని భార్య, పిల్లల్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులైన గుండెజబ్బులు, కిడ్నీలు, మూత్రపిండాలు, న్యూరో వంటి వ్యాధులతో సతమతమైతే ఇలాంటి వారి వినతిని పరిగణనలోకి తీసుకుంటారు. వ్యాధులకు సంబంధించిన ద్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో జత చేయాలి.
●* దివ్యాంగులకు సంబంధించి 40 శాతం పైబడి వైకల్యం ఉన్నట్టు వైద్యాధికారులు నిర్ధరించిన ద్రువీకరణ పత్రం ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. ● పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉన్నవారికి కదలిక తప్పదు. అభియోగాలున్నవారిదీ ఇదే పరిస్థితి. ● ఉద్యోగ సంఘాల నాయకులకు మినహాయింపు ఇచ్చారు.
*● ఎన్నికల సమయంలో విశాఖ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసిల్దార్ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. గతంలో అలా వెళ్లిన తహసిల్దార్లు వెనువెంటనే తిరిగి స్వస్థలాలకు వచ్చేవారు. ఈసారి ఇంతవరకు రాలేదు. పైగా తాజా జీవోలో వారి అంశం ప్రస్తావనకు రాలేదు.