ఉద్యోగుల బాధలు చూడలేకే సీపీఎస్ రద్దు

ఉద్యోగుల బాధలు చూడలేకే సీపీఎస్ రద్దు
ఎమ్మెల్యే బాబూరావుని సత్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేయనున్న సీపీఎస్ రద్దుతో రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు.
నక్కపల్లి ఎమ్మార్సీ భవనానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆయనకు అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన కుమారుడు జగన్కు సైతం ఉద్యోగులంటే అమితమైన ప్రేమని అన్నారు. వారు పడుతున్న బాధలు చూడలేక ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు, ఐ.ఆర్. పెంపు తదితర కార్యక్రమాలను అమలు చేయడానికి తొలి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయించారన్నారు.
ఉద్యోగులు ఆయనకు ఎల్లవేళలా అండగా నిలవాలన్నారు. మరోవైపు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఏటా ఆర్థిక సాయం ఇస్తారన్నారు.
ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించాలన్నారు.
ఉద్యోగులు సైతం ప్రభుత్వ బడికే తమ పిల్లలను పంపించాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పింఛన్, ఆశాలకు రూ. 10 వేలు జీతం పెంచారని, జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారన్నారు.
అనంతరం ఆయన విద్యార్థులకు బూట్లు, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. తహసీల్దారు తామరపల్లి రామకృష్ణ, ఎంపీడీఓ ప్రసాద్, ఈఓఆర్డీ పీఎస్ కుమార్ సత్కరించారు. ఎంఈఓ డీవీడీ ప్రసాదు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యురాలు జె.శేషారత్నం, పార్టీ రెండు మండలాల అధ్యక్షులు పొడగట్ల పాపారావు, బొలిశెట్టి గోవిందరావు తదితరులున్నారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమయ్యారు.