Five steps in HCM
హెచ్సీఎంలో అయిదు దశలు

వివరాలను పక్కాగా నమోదు చేయాలి
డీడీఓలకు డీటీఏ జేడీ పద్మజ సూచన
వన్‌టౌన్, న్యూస్‌టుడే: సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) రెండో దశలో చేపట్టనున్న హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్‌సిఎం)ను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఖజానా శాఖ సంయుక్త సంచాలకులు కె.పద్మజ సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెచ్‌సీఎం అమలుపై డీడీఓలకు బుధవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సీఎఫ్ఎంఎస్ రెండో దశ కింద హెచ్‌సీఎం మాడ్యూల్లో ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందజేయాలని, తద్వారా ఈఎస్ఆర్లను తయారు చేయవచ్చునన్నారు.
జిల్లా ఖజానా అధికారి, ఉప సంచాలకులు టి.శివరామప్రసాద్ హెచ్‌సీఎం పనితీరును వివరించారు. హెచ్సీఎంలో అయిదు దశలు ఉంటాయని చెప్పారు.
* ఉద్యోగి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో.. ఉద్యోగిగా చేరి ఐడీ వచ్చినప్పటి నుంచి పదవీ విరమణ వరకు.. అంటే సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రొబేషన్, బదిలీలు, పదోన్నతులు వంటి వివరాలను పొందపర్చాలి.
* సర్వీసు రికార్డులో సెలవులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు తదితర వివరాలను నమోదు చేయాలి. వీటితో మాన్యువల్ ఎస్ఆర్ బదులు ఈఎస్ఆర్ను తయారు చేస్తారు.
* సెల్ఫ్ సర్వీసులో సెలవులు, ఆర్జిత సెలవులు, వ్యక్తిగత సమాచారం మార్చుకోవడం, వేతన స్లిప్పులు వంటి అంశాలను పొందపర్చాలి.
* హెచ్ఆర్ సర్వీసులో రోజువారీ కార్యకలాపాలు, సెలవులు తప్పుగా పడితే సరిదిద్దుకోవడం, చనిపోయిన ఉద్యోగి తుది ఈఎల్ వివరాలు పొందుపర్చాలి.
* ఆన్ బీ ఆఫ్ సర్వీసులో.. నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు, సెలవులు, వారి నివేదనలను పొందపర్చాలి. ఆయా వివరాలు నమోదు చేసిన తర్వాత సీఎఫ్ఎంఎస్ తొలిదశ మాదిరిగానే బిల్లులను సిద్ధం చేసి డీడీఓలు సమర్పించాలని డీడీ రామ్‌ప్రసాద్ సూచించారు.