News

Realestate News

విశాఖ – విజయవాడ మధ్య తిరగనున్న డబుల్‌డెక్కర్‌ ఏసీ రైలు

విశాఖ – విజయవాడ మధ్య తిరగనున్న డబుల్‌డెక్కర్‌ ఏసీ రైలు

రైలు నెంబరు 22701/02.. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు.. ఎట్టకేలకు సోమవారం విశాఖ చేరుకుంది. జలంధర్‌ నుంచి రాయగడ మీదుగా విశాఖకు తీసుకొచ్చారు.

ఉదయ్‌ పేరిట రైల్వేశాఖ తీసుకొచ్చిన రైళ్లలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఇదే మొదటిది. దారి పొడవునా స్టేషన్లలో ఆగినపుడు ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.చాలామంది స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

సోమవారం ఉదయం విశాఖకు చేరుకున్న ఈ రైలును కోచింగ్‌ డిపోకు తరలించారు. సాంకేతిక పరిశీలన అనంతరం ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వాల్తేరు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోక.. పంజాబ్‌లోని జలంధర్‌లో దిక్కూమొక్కూ లేకుండా ఉన్న ఈ రైలు పరిస్థితిపై గత నెల 19న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘ఉదయించేదెప్పుడు’ శీర్షికతో కథనం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ వెంటనే స్పందించిన రైల్వే అధికారులు రైలును విశాఖ తీసుకురావటానికి చర్యలు మొదలుపెట్టారు. కోల్‌కతాలోని సీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సంప్రదించడంతో పాటు జలంధర్‌, కపుర్తల, దిల్లీ అధికారులతోనూ మాట్లాడి విశాఖకు వచ్చేలా చేశారు.

రైలు ఎలా వచ్చిందంటే…

19.06.19: ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘ఉదయించేదెప్పుడు’ శీర్షికతో కథనం. (మార్చి నెల నుంచి ఈ కొత్త రైలు జలంధర్‌ స్టేషన్‌లోనే ఉన్నా ఎవరూ పట్టించుకోని వైనంపై కథనం)

20.06.19: ఈ కథనానికి స్పందించిన వాల్తేరు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జలంధర్‌లో ఉన్న రైలును విశాఖకు రప్పించేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.

24.06.19: రైల్వేబోర్డు రోలింగ్‌స్టాక్‌ మెంబరు రాజేష్‌ అగర్వాల్‌ విశాఖ వచ్చారు. ప్రత్యేకంగా ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌పై సమీక్షించారు. వివిధ విభాగాలతో సంప్రదింపులు జరిపారు. సీఆర్‌ఎస్‌ అనుమతుల కోసం ప్రయత్నం ప్రారంభించారు.

01.07.19: సీఆర్‌ఎస్‌ అనుమతుల రాక. జలంధర్‌ నుంచి ఈ రైలు విశాఖ వచ్చేందుకు అడ్డంకులు తొలగాయి.

13.07.19: రైలును విశాఖకు తరలించేందుకు జలంధర్‌ రైల్వేస్టేషన్లో అధికారుల ఏర్పాట్లు.

15.07.19: విశాఖ చేరుకున్న ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డెక్కర్‌ కొత్త రైలు

అంతా అత్యాధునికం

కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉదయ్‌ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలున్నాయి. కొత్త వసతులు కూడా వస్తున్నాయి. ● విశాలమైన అద్దాలు ● విమానంలో ఉన్నట్టుగా సీట్ల అమరిక, కాళ్లు పెట్టుకునేందుకు అనువైన స్థలం. ● పైకప్పునకు ఉండే ర్యాకుల్లో లగేజీ ఉంచుకునే ఏర్పాటు. ● వైఫై సదుపాయం ● స్క్రీన్‌ల ద్వారా వచ్చే స్టేషన్‌ను ముందే తెలుసుకునే సౌకర్యం. ● వేగం గంటకు 62 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వరకు.

ఉదయ్‌ అంటే….

ఉత్కృష్ట్‌ డబుల్‌డెక్కర్‌ ఎయిర్‌కండిషన్డ్‌ యాత్రి ఎక్స్‌ప్రెస్‌

ఏమేం వచ్చాయంటే..

విశాఖ చేరిన ఈ రైలులో 18 డబుల్‌డెక్కర్‌ కోచ్‌లు, 4 పవర్‌కార్లు (జనరేటర్లు) వచ్చాయి.

తొలి ప్రయాణం ఎప్పుడు..?

గతంలో దేశంలో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మూడింటిని కేంద్ర రైల్వేమంత్రి ప్రకటించారు. అందులో ఇది ఒకటి. విశాఖ – విజయవాడ మధ్య 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ఎప్పటి నుంచి పట్టాలెక్కబోతోందనేది అందరిలోనూ ఆసక్తిగా ఉంది.

దీనికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ రైలులోని అన్ని కోచ్‌లను, పవర్‌కార్లను (జనరేటర్లను) పరీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తేదీ ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని వాల్తేరు అధికారులు చెబుతున్నారు.

డివిజన్‌కు మూడో ఎల్‌హెచ్‌బీ రైలు!

వాల్తేరు డివిజన్‌కు ఇదివరకు రెండు ఎల్‌హెచ్‌బీ రైళ్లున్నాయి. అది ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, తిరుమలకు వెళ్లే డబుల్‌ డెక్కర్‌ రైలు. ఇప్పుడు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకతో ఆ సంఖ్య 3కు చేరింది.

 ● ఈ రెండు రైళ్లకు తగ్గట్లు నిర్వహణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.

● ఈ రైలు తిరిగే సమయాలను ఇదివరకే నిర్ణయించారు. కాబట్టి విశాఖ కోచింగ్‌ డిపోలో నిర్వహణ ఏ సమయంలో నిర్వహించాలో షెడ్యూలు ఖరారు చేసే పనిలో అధికారులున్నారు.

టికెట్‌ ధర ఎంత?

ప్రతీ డబుల్‌డెక్కర్‌ కోచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. అంతా బాగుంది అనుకున్నప్పుడు విశాఖ – విజయవాడ మధ్య ట్రయల్‌రన్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రయాణ తేదీల్ని నిర్ణయిస్తారు. 

ఈ రైలు విశాఖ – విజయవాడ మధ్య దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరుల్లో ఆగుతుంది. ఆయా ప్రాంతాలకు టికెట్‌ ఎంతనేది ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.

సీట్ల అమరిక ఇలా..

*●ప్రతీ కోచ్‌కు రెండు డోర్లు ఉన్నాయి. 

● డోర్‌-1 దగ్గర 1 నుంచి 6వ నెంబరు సీటు వరకు కూర్చునేందుకు వీలుగా అమరిక ఉంది. 

*డోర్‌-2 పక్కనే సీటు నెంబరు 55 నుంచి 70 దాకా కూర్చునే వీలు. 

*కోచ్‌లో అప్పర్‌ డెక్‌ (పైఅంతస్తు), లోయర్‌ డెక్‌ ఉన్నాయి.

● లోయర్‌ డెక్‌లో సీటు నెంబరు 7 నుంచి 54వ నంబరు దాకా కూర్చోవచ్ఛు 

●*అప్పర్‌ డెక్‌లో సీటు నెంబరు 71 నుంచి 120 దాకా కూర్చోవచ్ఛు 

*మొత్తం ఒక్కో కోచ్‌లో 120 సీట్లున్నాయి.