News

Realestate News

చేతుల శుభ్రతతో వ్యాధులకు దూరం

Distance diseases hand hygiene

చేతుల శుభ్రతతో వ్యాధులకు దూరం

 

సీతంపేట జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో సబ్బుతో చేతులు కడుగుతున్న విద్యార్థులు

మనిషికి శారీరక శుభ్రత ఎంత అవసరమో.. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల శుభ్రత అంతే అవసరం. కేవలం చేతులు కడుక్కోనంత మాత్రాన ఏమవుతుందని భావించవచ్చు.

దానివల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని ఎంతమందికి తెలుసు..? అందుకే బాల్యం నుంచీ అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబరు 15న ప్రపంచ వ్యాప్తంగా హ్యాండ్‌ వాష్‌ డేను నిర్వహిస్తున్నారు.

మొక్కుబడిగా ఏడాదిలో ఒక్క రోజుతో మ.మ. అనిపించకుండా ‘గ్రామ స్వరాజ్య సమితి’(జి.ఎస్‌.ఎస్‌) అనే సంస్థ ‘స్వచ్ఛభారత్‌ స్వచ్ఛ విద్యాలయ్‌’లో భాగంగా మూడేళ్ల పాటు నగరంలోని 20 జీవీఎంసీ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అవగాహన కలిగించి సత్ఫలితాలను సాధించింది. ఫలితంగా డయేరియా వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో పాటు ఈ పాఠశాల్లో హాజరు శాతం పెరిగింది. న్యూస్‌టుడే, సీతంపేట

సీతంపేట జీవీఎంసీ పాఠశాలలో నూతనంగా నిర్మించిన ట్యాప్‌లు

భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఉత్తి నీటితో కాకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చేతులకు అంటిన మలినంతోపాటు కనిపించని సూక్ష్మ జీవులు బయటకు పోతాయి.

చేతులు శుభ్రం చేయకుండా ఆహార పదార్థాలు ఏమి తిన్నా వాటితో సూక్ష్మజీవులు కడుపులో చేరి డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉంది.

జీఎస్‌ఎస్‌ సంస్థ నగరంలోని 20 జీవీఎంసీ పాఠశాలలను గుర్తించింది. ఈ పాఠశాలల్లో హ్యాండ్‌ వాష్‌కు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించి, వారితో చేయించారు.

ఈ కార్యక్రమం 2016 అక్టోబర్‌ నెలలో ప్రారంభించారు. ఈ మూడేళ్లలో 20 పాఠశాలల్లో 6101మంది విద్యార్థులు చేతుల శుభ్రతను అలవాటుగా చేసుకున్నారు. వీరిలో 3173 మంది బాలికలు, 2928 మంది బాలురు ఉన్నారు.

విద్యార్థులు పాటించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు పాటిస్తున్నారు. మౌలిక వసతులు పెరగడం ద్వారా ఈ పాఠశాలల్లో ఈ ఏడాది అదనంగా 752 మంది విద్యార్థులు అదనంగా చేరారు.

అందరం పాటిస్తున్నాం..: హ్యాండ్‌ వాష్‌ను ఇప్పుడు అంతా పాటిస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులే కాకుండా మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతా అనుసరిస్తున్నాం. ఇప్పుడు పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నాం.

– పి.శ్రావణి, 8వ తరగతి, జీవీఎంసీ ఉన్నత పాఠశాల, ఆర్పీపేట.

మొదట్లో ఇబ్బందులు పడ్డాం..: జి.ఎస్‌.ఎస్‌. సిబ్బంది వచ్చి చేతుల శుభ్రత గురించి చెబుతామంటే తొలి రోజుల్లో ఇబ్బంది పడ్డాం. చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పాలా అని అనుకునేవాళ్లం.

తర్వాత మాకూ అర్ధమైంది దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో. ఈ పథకాన్ని జీవీఎంసీలోని అన్ని పాఠశాలల్లోనూ వర్తింపచేస్తే మంచిది. అధికారులు ఈ దిశగా ఆలోచించాలి.

– శాంతికుమారి, ఇన్‌ఛార్జి హెచ్‌.ఎం. కె.కాలనీ

విద్యార్థుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు జి.ఎస్‌.ఎస్‌ సంస్థ బాల స్వచ్ఛత కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ పాఠశాలల్లో తమతోటి పిల్లలు చేతులు శుభ్రపర్చుకోనేలా చూడడం, ఇంటి వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేతులు శుభ్రపర్చుకొనేలా చేయడం ఈ కమిటీల బాధ్యత.

కుటుంబ సభ్యులు ఎవరైనా చేతులు శుభ్రం చేసుకోనట్లైతే ఆ విషయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. మర్నాడు కుటుంబ సభ్యులను పాఠశాలకు పిలిపించి చేసిన తప్పును వారికి వివరిస్తారు. ఈవిధంగా పిల్లలే కుటుంబానికి హ్యాండ్‌ వాష్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంస్థ ప్రతినిధులు చేతులు శుభ్రపర్చుకోవడంలో మెలకువలను తెలిపారు.

తీర్చిదిద్దిన జీవీఎంసీ పాఠశాలలు ఇవే..

శివాజీపాలెం, పెదవాల్తేర్, చినవాల్తేరు, సీతంపేట,

రెల్లివీధి, టౌన్‌ హాల్, కోటవీధి, ఆర్‌.పి.పాఠశాల, రైల్వే

న్యూకాలనీ, అచ్చుత రామరాజు పాఠశాల ఆఫీస్‌ కాలనీ,

ప్రాథమిక పాఠశాల కంచరపాలెం, మల్కాపురం,

త్రినాధపురం, ఆమ్జీ ఎస్టేట్, ప్రాథమికోన్నత పాఠశాల

బుచ్చిరాజుపాలెం, ఉన్నత పాఠశాల కె.కాలనీ, శ్రీహరిపురం,
ఆర్పీపేట, మహారాణిపేట, కె.డి.పి.ఎం పాఠశాల చినవాల్తేరు.

పెద్ద సమస్య తీరుతుంది: చేతుల శుభ్రత పెద్దపనేం కాదు కానీ, పెద్ద సమస్యను తీర్చుతుంది. దీన్ని అన్ని పాఠశాలల్లో విధిగా అమలు చేయాలి. విద్యార్థి దశనుంచే అలవాటు చేయడం వల్ల తన కుటుంబం ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుంటుంది. మొదట్లో ఇదేం పని అనుకున్నాం. విద్యార్థులు చదువుతో పాటు శుభ్రతను గురించీ తెలుసుకోవాలి.

– గోపీనాధ్, ప్రధానోపాధ్యాయులు, జీవీఎంసీ

ప్రాథమికోన్నత పాఠశాల, బుచ్చిరాజుపాలెం.