News

Realestate News

శివారు… సుడి తిరిగేలా..

development of lands,visakhapatnamrealestate news

చివరి దశకు చేరుకున్న ప్రత్యేక ప్రణాళిక తయారీ

405 చ.కి.మీ. పరిధిలో అభివృద్ధి కోసం సన్నాహాలు
అనందపురం, మధురవాడ, భీమునిపట్నానికి మహర్దశ

నగర శివారు ప్రాంతాల్లో ఇన్నాళ్లూ నిరుపయోగంగా ఉన్న విలువైన భూములు త్వరలోనే వినియోగంలోకి రానున్నాయి. పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, నివాస (ఐసీఏఆర్‌) అవసరాల కోసం వీటిని ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక ప్రాంత అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయడం నగర చరిత్రలో ఇదే మొదటిసారి. మరో నాలుగైదు నెలల్లో తుది దశ ప్రక్రియను పూర్తి చేసి ప్రణాళికను అమలు చేయనున్నారు. దీంతో భవిష్యత్తులో శివారు ప్రాంత స్వరూపమే మారిపోయే అవకాశాలున్నాయి.
ఆనందపురం – భీమునిపట్నం – మధురవాడ మధ్య 405 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక తయారీ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని నాలుగు విభాగాలుగా అభివృద్ధి చేసి వివిధ రంగాలకు ప్రధాన వేదికగా నిలపాలన్నది ఉద్దేశం. ఇప్పటివరకు సిద్ధం చేసిన ముసాయిదాలో మరిన్ని సవరణలు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. వీటిని మళ్లీ కలిపి తుది ప్రణాళికను యంత్రాంగం ఆమోదిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిన్నర క్రితం నగరంలో పర్యటించినపుడు మధురవాడ నుంచి ఆనందపురం మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, లోపలి భాగంలో, భీమునిపట్నానికి చుట్టు పక్కల ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న అనేక ప్రభుత్వ, ప్రయివేట్‌ భూములు కనిపించాయి. పట్టణీకరణతో నగరం నానాటికీ కిక్కిరిసిపోతోంది. ప్రజలు, వాహనాల సంఖ్య పెరిగుతున్న స్థాయిలో విశాలమైన రహదారుల్లేవు. విస్తరణకూ అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆనందపురం, మధురవాడ, భీమునిపట్నంలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) పరిధిలో ఇప్పటికే ఉన్న బృహత్తర ప్రణాళికకు సవరణ, కొత్త ప్రాంతాలకు ప్రణాళిక (మాస్టర్‌ ప్లాను) తయారీ 2018 నవంబరుకి పూర్తవుతుంది. అప్పటివరకు వేచి చూడక శివారులోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. దీంతో నగర పరిధిలో కొత్త ఆవాసాలు పెరగడం, వివిధ రంగాల అభివృద్ధి కోసం స్థలాల కేటాయింపు ప్రక్రియ సులువవుతుంది.

నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ….
ఆనందపురం, మధురవాడ, భీమునిపట్నం పరిధిలో నిరుపయోగంగా ఉన్న 405 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దీనివల్ల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నది అధికారుల ఆలోచన.

1) అటవీ ప్రాంతం: వీటి పరిధిలోని అటవీ ప్రాంత సంరక్షణ, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రణాళికలో సూచించారు.
పర్యావరణహితంగా, ఆహ్లాదకర వాతావరణానికి చిరునామాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది ఉద్దేశం.

2) మెరుగైన రహదారులు: భవిష్యత్తు అవసరాల కోసం 80, 100, 120 అడుగుల విస్తీర్ణంలో మాస్టర్‌ ప్లాను రహదారుల ఏర్పాటు కోసం ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించనున్నారు.

3) వివిధ రంగాల అభివృద్ధి: 405 చదరపు కిలోమీటర్ల పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయం, వినోదం, పారిశ్రామిక, ఐటీ రంగాల సమగ్రాభివృద్ధి కోసం ప్రాంతాలను నిర్దేశించారు.

4) వారసత్వ సంపద సంరక్షణ: మూడుచోట్లా అక్కడక్కడా వారసత్వ సంపదగా ఉన్న పలు నిర్మాణాల సంరక్షణ, అభివృద్ధి కోసం తగు చర్యలను ప్రణాళికలో సూచించారు. భీమునిపట్నంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నిర్మాణాలున్నాయి. వీటిని కాపాడుకుంటూ, భావితరాలకు వీటి గురించి తెలియజెప్పేలా సూచనలు చేశారు.

* ఆనందపురం, మధురవాడ, భీమునిపట్నం పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి కోసం నిర్దేశించిన బృహత్తర ప్రణాళిక ముసాయిదాలో ఏయే రంగాలు ఎంత విస్తీర్ణంలో అభివృద్ధికి నోచుకునే వీలుందో పేర్కొన్నారు.

దశల వారీగా అన్ని ప్రాంతాల్లోనూ….
నగరానికి మూడు వైపులా ఉన్న శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం దశల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నగరంలో ట్రాఫిక్‌, కాలుష్యం, రహదారులు, ఆవాసం…ఇలా అనేక సమస్యలకు పరిష్కారం లభించాలంటే కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. ఈ క్రమంలో మొదటి దశగా ఆనందపురం, మధురవాడ, భీమునిపట్నంలో నిరుపయోగంగా ఉన్న భూముల, ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండో దశలో ఆనందపురం – పెందుర్తి, పెందుర్తి – కొత్తవలస, అగనంపూడి – అనకాపల్లి, ఆనందపురం – తగరపువలస..ఇలా పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రాబోతున్నాయి. ఆయాచోట్ల తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పలువురు ముందుకొచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.