News

Realestate News

అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి

development needs done quickly


అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి

అధికారులకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆదేశం

సమావేశంలో పాల్గొన్న లాలం భవానీభాస్కర్‌, సీఈవో రమణమూర్తి

 జిల్లాలో గతంలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానిభాస్కర్‌ అధికారులను ఆదేశించారు.

గురువారం జడ్పీ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ అధ్యక్షతన 1 నుంచి 7 స్థాయీ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కొత్తగా ఎలాంటి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టరాదని, గతంలో చేపట్టి కొనసాగుతున్న పథకాలను వెంటనే పూర్తిచేయాలన్నారు.

డీఆర్‌డీఏ ద్వారా పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు రూ. 10 వేల చొప్పున, పింఛనుదారులకు రూ. 90.41 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు.

డ్వామా ద్వారా ఉపాధి కూలీలకు 2.21 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ 3.28 లక్షల పనిదినాలు కల్పించామన్నారు.

గృహనిర్మాణం, బీసీ సంక్షేమం కింద చేపట్టిన వివిధ పథకాలను ఆయా శాఖల అధికారులు స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తిరుపతిరావు వెల్లడించారు.

అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచామన్నారు. పీఎంజీఎస్‌వై కింద జిల్లాలో 201 పనులు మంజూరు కాగా, 16 పనులు పూరిచేశామని, 151 పనులు వివిధ దశల్లో ఉన్నాయని, 34 పనులు ఇంకా మొదలవలేదని పంచాయతీ అధికారులు వెల్లడించారు. సమావేశాల్లో జడ్పీ సీఈఓ రమణమూర్తి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.